మాస్క్‌ ధరించి ధర్మశాలకు యుజ్వేంద్ర చాహల్

మాస్క్‌ ధరించి ధర్మశాలకు యుజ్వేంద్ర చాహల్

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే 3 వన్డే సిరీస్ ల‌లో తొలి మ్యాచ్ మార్చి 12 న ధర్మశాలలో జరుగనుంది. భారతదేశంలో కరోనావైరస్ ఎఫెక్ట్ ఈ సిరీస్‌పై కూడా ఉండొచ్చ‌ని అనుకుంటున్నారు. భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మంగళవారం ధర్మశాల వెళ్లేటప్పుడు, ఢిల్లీ విమానాశ్రయంలో మాస్క్‌ ధరించి కనిపించారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దక్షిణాఫ్రికాతో సహా భారత ఆటగాళ్లందరూ ఎవరితోనూ హ్యాండ్ షేక్ కానీ, అభిమానులతో సెల్ఫీలు కానీ తీసుకోరని స్పష్టంగా చెప్పారు.

భారతదేశంలో బుధవారం వరకు మొత్తం 61 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ నివారించడానికి ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 14 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళ లో 8, పూణేలో 3, కర్ణాటకలో 3 కేసులు నమోదయ్యాయి. వైరస్ ముప్పు కారణంగా ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్ పౌరులు దేశంలోకి ప్రవేశించడాన్ని ప్రభుత్వం నిషేధించింది.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే మార్చి 15 న లక్నోలో, మూడో మ్యాచ్ కోల్‌కతాలో మార్చి 18 న జరుగుతుంది. కరోనావైరస్ ఈ పర్యటనపై ఎలాంటి ప్రభావం చూపదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే చెప్పారు. అన్ని మ్యాచ్‌లు సకాలంలో జరుగుతాయి. అదే సమయంలో, ఆఫ్రికన్ జట్టు నిర్వహణతో సంబంధం ఉన్న ఒక అధికారి మాట్లాడుతూ, “విదేశాలలో ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మేము మా బృందాన్ని కోరాం. ముఖ్యంగా, అభిమానులు సెల్ఫీలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ” రెండు జట్లు ధర్మశాలలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియట్లేదు కానీ, ఐపీఎల్ రద్దు అవ్వద్దని గంగూలీ ఇప్పటికే చెప్పారు. ఇప్పటివరకు ఈ విషయంలో బీసీసీఐ ఎటువంటి సలహా ఇవ్వలేదు. ఐపీఎల్‌తో సమస్య ఏమిటంటే, ఈ లీగ్‌లోని ఆటగాళ్లకు అభిమానులతో ఎక్కువ పరస్పర ఇంట‌రాక్ష‌న్‌ ఉంటుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, జైపూర్ సహా పలు చోట్ల మ్యాచ్‌లు జరుగుతాయి.  ఇన్ఫెక్షన్ పెంచే అవకాశం కూడా ఉంది.