ముఖ్యనేతలతో భేటీ కానున్న సీఎం – కేసీఆర్‌

cm meeting with party leaders

ఎన్నికల ప్రచారం కొనసాగింపు, సభల నిర్వహణ, ఇతర వ్యూహాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన తన నివాసంలో సమావేశం కానున్నారు. ఈ నెల ఏడో తేదీన హుస్నాబాద్‌లో సభ ఏర్పాటు చేసి సీఎం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ తర్వాత వినాయక చవితి ఉత్సవాలు రావడంతో, తర్వాత సభకు విరామం ఇచ్చారు. ఆదివారంతో నిమజ్జనోత్సవాలు ముగిశాయి. రెండో సభ, ఆ తర్వాత సభలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సోమవారం స్పష్టత రానుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల నుంచి సీఎం రెండో సభ కోసం అభ్యర్థనలు వచ్చాయి. వీటన్నింటిపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో సభ జరిపినందున, దక్షిణ తెలంగాణలో రెండో సభ జరపాలనే ప్రతిపాదన వస్తోంది.

ఎన్నికల ప్రచారసరళి, అభ్యర్థులపై సానుకూలత, పార్టీ శ్రేణుల స్పందన ఇతర అంశాలను సీఎం పరిగణనలోనికి తీసుకోనున్నారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌ పూర్వ జిల్లా పరిధిలోని మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినందున రెండో సభకు ఈ జిల్లాకు ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అక్కడక్కడా అసమ్మతి ఉన్నందున దానికి అవకాశం ఇస్తారా? లేదా? అనే సందేహాలూ ఉన్నాయి. నల్గొండ కీలకమైన జిల్లా. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తదితరులు ఇక్కడే పోటీ చేసే అవకాశం ఉన్నందున సీఎం ప్రచార సభ ప్రస్తుతం అక్కడ నిర్వహించాలని జిల్లా నేతలు కోరుతున్నారు. విపక్షాల నుంచి ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. మరోవైపు తెరాస నుంచి కూడా హుజుర్‌నగర్‌, కోదాడలలో అభ్యర్థులు ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ సభను సత్వరమే నిర్వహించాలా వద్దా అనే చర్చలు అధిష్ఠానంలో సాగుతున్నాయి. అ అంశాలన్నింటినీ సమీక్షించిన తర్వాత సీఎం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.