తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవే

తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవే

 

దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను రైల్వేబోర్డు బుధవారం రాత్రి ఖరారు చేసింది. జోన్లు, రూట్ల వారీగా నడిపే రైళ్లు, ప్రయాణ వేళల వివరాల్ని అన్ని జోన్ల జీఎంలకు పంపించింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపికచేసినట్లు సమాచారం. వీటికి మే 21 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. స్లీపర్‌ బోగీల్లో రిజర్వేషన్లు అయిపోయాక 200 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరే స్లీపర్‌, ఏసీ, జనరల్‌ బోగీలు ఉంటాయి. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు. 

రోజూ నడిచే రైళ్లు: ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02701/02), హావ్‌డా- సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (02703/04), హైదరాబాద్‌- న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (02723/24), దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791/92), విశాఖపట్నం- ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (02805/06), గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (07201/02) , తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (02793/94), హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (02727/28).

దురంతో రైళ్లు: సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ (02285/86) (వారానికి రెండుసార్లు)

సికింద్రాబాద్‌, విజయవాడ మీదుగా:

* హావ్‌డా-యశ్వంత్‌పూర్‌ (వయా విజయవాడ) దురంతో ఎక్స్‌ప్రెస్‌ (02245/46).. వారానికి ఐదు రోజులు
* ముంబయి సీఎస్‌టీ- భువనేశ్వర్‌ (వయా సికింద్రాబాద్‌, విజయవాడ) కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (01019/20).. ప్రతిరోజు

సాధారణ తరగతి సీట్లకూ రిజర్వేషనే:

ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి పెట్టెల్లోని సీట్లకు కూడా రిజర్వేషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్‌ ఉండే జనరల్‌ కోచ్‌లకు ద్వితీయ తరగతి సీటింగ్‌ రుసుములు వసూలు చేస్తారు.

* మొత్తంమీద ఈ రైళ్లలో రిజర్వేషన్‌ లేని పెట్టెలంటూ ఏవీ ఉండవు.
* అన్ని టికెట్లనూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/ యాప్‌ ద్వారానే తీసుకోవాలి. రిజర్వేషన్‌ కౌంటర్లు, రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకునే అవకాశం ఉండదు. రైల్లోనూ ఎవరికీ టికెట్లు ఇవ్వరు.
* 30 రోజుల ముందుగా టికెట్లు తీసుకోవచ్చు.
* ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను కూడా నిబంధనల ప్రకారం జారీ చేస్తారు.
* తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్లు ఉండవు.