శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను బీభత్సం..!!

0
244
titli toofan at srikakulam

ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుఫాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుఫాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్‌ తుఫానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో ఉద్ధానం వారేగాక శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు.

తుఫాను కారణంగా చెట్లు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. పూరిళ్లు పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. రైతులకు అపారనష్టం వాటిల్లింది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. వరి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు విజయనగరం జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. ఇక ఒడిశా రాష్ట్రంపైనా తిత్లీ విరుచుకుపడింది.

titli toofan at srikakulam

ప్రధానంగా గజపతి జిల్లాలో బీభత్సం సృష్టించింది. మొత్తంగా విలయ విధ్వంసం సృష్టించి, భీకర గాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ అతి తీవ్ర తుఫాను గురువారం వేకువ జామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమబెంగాల్‌ వైపు పయనిస్తోంది. గురువారం రాత్రి పది గంటల సమయానికి ఇది ఒడిశాలోని భవానీపట్నాకు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Tithal thoofan 1

తుఫాను ప్రభావంతో విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాల కారణంగా గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. అలాగే తుఫాను ధాటికి మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. తొమ్మిది ఎద్దులు, గేదెలు చనిపోగా, గొర్రెలు, మేకలు 80 వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే 500 కోళ్లు చనిపోయినట్లు సమాచారం.