కరోనా పై పోరుకి తరలివచ్చిన టాలీవుడ్

కరోనా పై పోరుకి తరలివచ్చిన టాలీవుడ్

 

కరోనా వైరస్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఈ వైరస్ నియంత్రణ చర్యల కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్ కోటి రూపాయలు విరాళం అందించగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సైతం రూ.70 లక్షలు అందజేశాడు..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం రూ. కోటి ఇవ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత విషమ పరిస్థితులను అధిగమించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. ఇది రోజువారీ కూలీలలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. దీనిలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా భాగమే అని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఫిల్మ్ వర్కర్స్ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు..

కరోనాపై పోరాటానికి సూపర్ స్టార్ మహేష్ సైతం భారీ విరాళం ప్రకటించాడు. ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయని ఈ పోరాటంలో తానుకూడా భాగస్వామిని కావాలనుకుంటున్నానని మహేష్ తెలిపారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు అండగా నిలబడుతూ మనల్ని మనం కాపాడుకోవాలని, మానవత్వంతో ఈ యుద్దంలో గెలుద్దామని మహేష్ తెలిపారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కరోనా పై పోరాటం చేసేందుకు ముందుకొచ్చాడు. కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. వీరితో పాటు త్రివిక్రమ్ రూ.20 లక్షలు,అనిల్ రావిపూడి రూ.10 లక్ష్లలు, కొరటాల శివ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు విరాళాలు అందించారు. కామెడీ హీరో అల్లరి నరేష్ తన సినిమా కోసం పనిచేస్తున్న 50 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశాడు.

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిన వేళ సిని పరిశ్రమ పెద్దలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. అయితే మరికొందరు నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తే చాలా మంది నిరుపేద కళాకారులకు మంచి చేసినట్లు అవుతుంది.