బోరు బావిలో ప‌డిన బాలుడి క‌థ విషాదాంతం

బోరు బావిలో ప‌డిన బాలుడి క‌థ విషాదాంతం

 

మెద‌క్ జిల్లాలో దారుణం చోటుచేసుకోంది. స‌రాదాగా ఆడుకుంటూ బోరు బావిలో ప‌డిపోయిన మూడేళ్ల బాలుడు  మృతి చెందాడు. బాలుడిని ర‌క్షించేందుకు అధికారులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లితం లేకుండా పోయింది. దాదాపు 17 అడుగుల లోతులో ఉన్న బాలుడిని 12 గంటల పాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతి  కష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ బాలుడు అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు తెలిపారు.
 
వివ‌రాల్లోకి వెళ్తే పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బిక్షపతి అనే వ్యక్తి తన పొలంలో మూడు బావులు వేశాడు. వాటిలో నీళ్ల పడకపోవడంతో ఒక్కొక్క దాన్ని పూడ్చుతున్నారు. ఈ సమయంలో నిన్న సాయంత్రం 6 గంటలకు అత‌ని మూడేళ్ల మ‌నుమ‌డు సాయివర్ధన్ ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఈ సంఘ‌ట‌న జ‌రిగేప్పుడు  తాత భిక్షపతి, తండ్రి గోవర్ధన్ అక్క‌డే ఉన్నారు. దీంతో వారు  చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
 
దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు 108 వాహనానికి సమాచారమిచ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఆక్సిజన్‌ పైపు లోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. బోరు బావి 150 అడుగుల లోతు ఉండగా.. చిన్నారి సంజయ్‌ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించారు. దాంతో  బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. బాలుడు సురక్షితంగా బయటపడతాడని భావించారు.

కానీ ఆ బాలుడిని తీసే క్ర‌మంలో  కొంత మట్టి కూడా బాలుడిపై పడినట్లు తెలిసింది. దీంతో ఆ బాలుడు మ‌ర‌ణించాడు. దాంతో వెంట‌నే అతడి మృతదేహాన్ని మెదక్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే బోరుబావులను పూడ్చే లోపే చిన్నారి మృతి చెంద‌డంతో  కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.