​​​​​​​ఒక్క టిక్కెట్ పై మూడు సినిమాలు

 వరల్డ్  ఫేమస్ లవర్ రివ్యూ..

 

 

బ్యానర్; క్రియేటివ్ కమర్షియల్స్
నిర్మాతలు : KS రామారావు, KA వల్లభ
దర్శకుడు : క్రాంతి మాధవ్
సంగీతం : గోపీ సుందర్

నటులు : దేవరకొండ విజయ్, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె, ప్రియదర్శి.

కథ ఒక్కముక్కలో - 
గొప్ప రైటర్ అవుదాం అనుకున్న  గౌతమ్, తన ప్రేమ కథనే ఓ పుస్తకంగా రాయడం, దానికి వరల్డ్ ఫేమస్ లవర్ అని పేరుపెట్టి రిలీజ్ చెయ్యడం.

విషయం ఏంటంటే ...

ప్రేమంటే కాంప్రమైజ్ అవ్వడం, శాక్రిఫైజ్ చెయ్యడం అని సినిమా మొదట్లో రాశి ఖన్నా  చివర్లో విజయ్ దేవరకొండ అంటారు.. ఇదే కధ.
యామిని (రాశి ఖన్నా) గౌతమ్ ని(విజయ్) ని ప్రాణం గా ప్రేమించి సర్వస్వం అర్పించి బ్రేక్ అప్ చెప్పి వెళ్లి పోతుంది.  ఆ తర్వాత ప్రేయసి కోసం పడే తపన, ఎమోషన్ బాగానేవుంది. కానీ, 
సహజంగా రచయితలు అంటే తమ స్వానుభవాలనుండో, సమాజంలో జరిగే సంఘటనలకి స్పందిచో లేక ఊహించో రచనలు చేస్తుంటారు. 
కానీ ఇక్కడ గౌతమ్ తన ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక తనని కన్విన్స్ చెయ్యడం కోసం రచన చేస్తుంటాడు. పోనీ స్వచ్ఛమైన ప్రేమ అని చూపించినా,
 సహజీవనం చేస్తున్నంత సేపూ తినడం, సెక్స్ చేయడం, టీవీ చూడడం, తప్ప ఇంకేం ఉండదు. 
ఓవైపు రచయిత అంటాడు.. మరోవైపు పుస్తకాలంటే గౌరవం లేకుండా చదివేసి గదిలో చెత్త పేపర్స్ లా విసిరేస్తాడు.  అలాంటివాడు తన ప్రియురాలికోసమే పుస్తకం రాయడం, 
బుక్ రాస్తున్నాను వచ్చేయ్ అంటూ వెంట పడడం,
పోనీ రాసిన కధలు ఇంతవరకూ చూడనివి, చడవనివి అంటే అదీ కాదు.  షేక్ స్పియర్ లా  గొప్పగా ఉన్నాయా అంటే అదీ లేదు  పరమ రొటీన్. 

మొదటి కథలో..  శీనయ్య(విజయ్) బొగ్గు గని లో కార్మికుడు. గొప్పగా ప్రేమిచే భార్య సువర్ణ(ఐశ్వర్య రాజేష్).
ఇంతలో గని లోకి మేడం(కేథరిన్) వస్తుంది, భార్యని నిర్లక్యం చేసి ఆమె వెంట పడతాడు. తర్వాత తప్పు తెలుసుకుని భార్యతో ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఉన్నంతలో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. 
 అప్పట్లో రాజేంద్రప్రసాద్, సినిమాల్లో ఇలాంటి కథలు ఎన్నో చూసాం. ఈ ఎపిసోడ్ లో శత్రు మీద తీసిన కామెడీ కూడా అప్పట్లో కోట, బాబుమోహన్ తరహా కామెడీని గుర్తుకు తెస్తుంది. 

తర్వాత కధ ఫ్రాన్స్ లో.. అక్కడ పక్క ఫ్లాట్ లో పైలెట్ (ఇసబెల్లె) పరిచయం అవుతుంది ఈజీగా ప్రేమలో పడిపోతుంది. అక్కడ ఒక  ఇన్సిడెంట్ జరగటం ఆడియన్స్ ఊహించినట్లే హీరో త్యాగం చేయడం జరుగుతుంది. 
ఈ కథలతో వరల్డ్ ఫేమస్ లవర్ అని బుక్ రాయడం, ఆ బుక్ కి క్లయిమాక్స్ లేకుండా ఖాళీ పేజీలు వదిలేసి పబ్లిష్ చెయ్యడం.. అవి మిలినియన్స్ లో అమ్ముడు పోవడం కొంచెం అతి అనిపిస్తుంది. దీంతో సెకండ్ హాఫ్ మొత్తం పడిపోయింది. 
చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ పుస్తకానికి కన్ క్లూజన్ ఇవ్వడం. 

అప్పట్లో తమిళ దర్శకుడు విక్రమన్ తన అన్ని సినిమాల్లో ఇలాంటి క్లయిమాక్స్ లు పెట్టేవాడు. తెలుగులో రాజా సినిమా క్లయిమాక్స్ లో సౌందర్య స్టేజిపై వెంకటేష్ గురించి చెప్పినట్టు.. 
ఇక్కడ విజయ్.. అసలు వరల్డ్ ఫేమస్ లవర్ నేను కాదు, యామిని అని సెలవిస్తాడు. 
 సినిమాలో ఎక్కడా కాన్ఫ్లిట్ అంటూ ఏమీ ఉండదు.  కాంప్రమైజ్ అవ్వడం, శాక్రిఫైజ్ చేయడం తప్ప. గౌతమ్ ని  యామిని విపరీతంగా ప్రేమి స్తుంది.. గౌతమ్ యామినిని పిచ్చిగా ప్రేమిస్తాడు. శీనయ్యని సువర్ణ గొప్పగా ప్రేమిస్తుంది..  శీనయ్య సువర్ణని ప్రేమిస్తాడు.  శీనయ్యని కేథరిన్ ఫుల్ గా ప్రేమిస్తుంది.. శీనయ్య కేథరిన్ ని డీప్ గా ప్రేమిస్తాడు. ఫ్రాన్స్ లో హీరోని ఇసబెల్లె విపరీతం గా ప్రేమిస్తుంది.. ఇసబెల్లెని హీరో గుడ్డిగా ప్రేమిస్తాడు.  ఇలాగే సినిమా కూడా గందరగోళంగా ఉంటుంది.  ఓవరాల్ గా ఒక్క టిక్కెట్ పై మూడు సినిమాలు చూసినట్టు ఉంటుంది. 
ఏ ముహూర్తాన అర్జున్ రెడ్డి లో హీరో ఐస్ ముక్కలేసుకుని వణుకుతున్నట్టు ఉండే వాయిస్ మాడ్యూలేషన్ స్టార్ట్ చేసాడో ప్రతీ సినిమాలోనూ విజయ్ అదే కంటిన్యూ  చెయ్యడం వల్ల మొనాటనీ అనిపిస్తుంది. 
క్లయిమాక్స్ కూడా అర్జున్ రెడ్డి లా తీశారు, మొత్తం మీద ఈ లవర్, లవర్స్ డే రోజు విరపూయని ఫ్లవర్ అయ్యింది. 
రైటర్ గా ఎమోషనల్ క్యరెక్టర్ లో హీరో పెర్ఫార్మన్స్ బాగా చేసాడు. 
ఐశ్వర్య రాజేష్ అద్భుతం గా చేసింది. 
రాశిఖన్నాకి బాగా చేసే అవకాశం దొరికింది. 
కేథరిన్ ది చిన్న క్యరెక్టర్. 
ఇసబెల్లె పర్వాలేదనిపించింది. 
మిగతా వారివి చెప్పుకోదగ్గ క్యరెక్టర్స్ కావు. 
దర్శకుడు క్రాంతి మాధవ్ ఇంతకు ముందు సెన్సిబుల్ సినిమాలు తీసాడు. ఇప్పుడు కొంచెం బోల్డ్ కంటెంట్ టచ్ చేసాడు. స్క్రిప్ట్ విషయం లో కాంప్రమైజ్ అయ్యి, ఎవరికో సాక్రిఫైజ్ చేసినట్టున్నాడు. 

 చాలా స్లోగా ఉండడం వల్ల మాస్ జనాలకి ఎక్కే అవకాశం లేదు. 
కెమెరా పర్వాలేదు. 
ఎడిటింగ్ కత్తిరికి కాస్త పని పెట్టి ఉంటే బావుండేది. 

చివరగా
వరల్డ్ ఫేమస్ లవర్
వేలంటైన్స్ డే రోజు పువ్వు
చేతిలో పెడతాడు అనుకుంటే..  చెవిలో పెట్టాడు. 

రేటింగ్ : 2/5