జగన్ విన్నింగ్ డే... ఇంట్లో వైఎస్ భారతి సెలబ్రేషన్స్

జగన్ విన్నింగ్ డే... ఇంట్లో  వైఎస్ భారతి సెలబ్రేషన్స్

 

వైఎస్ జగన్ చరిత్రలోనే అతి పెద్ద అచీవ్ మెంట్ ఏదైనా ఉందంటే అది మే 23, 2019 న సాధించిన ఘనవిజయమే. ఆ విజయం జగన్ కుటుంబ సభ్యులకు వెరీ వెరీ స్పెషల్. అందులోనూ జగన్ సతీమణి వైఎస్ భారతికి జీవితాంతం మరచిపోలేని అద్భుతమైన ఘట్టం. అందుకే ఆమె ఇంత గొప్ప విన్నింగ్ డే ని తన ఇంట్లో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారట. లాక్ డౌన్ కారణంగా పార్టీ కార్యక్రమాలు, విజయోత్సవాలు ఏమీ నిర్వహించలేదు. కానీ జగన్ సతీమణి వైఎస్ భారతి మాత్రం ఇంట్లోనే కేవలం కుటుంబంతో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు. 

వైఎస్ భారతి చాలా ఉద్వేగం పొందిన రోజుల్లో మే 23, 2019 అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే ఆ విజయం కోసం జగన్ పడ్డ కష్టం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ కష్టాల ఎదురీతలో జగన్ కంటే ఎక్కువ కష్టం అనుభవించారు వైఎస్ భారతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఆ ఇంట్లో ఎవ్వరికీ ఎలాంటి రాజకీయాలు తెలియవు. తండ్రి వైఎస్సార్ తో పాటు జగన్ మాత్రమే రాజకీయాల కోసం ఆలోచించేవారు. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వైఎస్సార్ రెండో సారి విజయం సాధించారన్న ఆనందం అలా కళ్లుముందు కదలాడుతుండగానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతున్న రాజన్న మరుగైపోయారు. అంతే ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో అన్నీ కన్నీటి సుడిగుండాలే. గుండెల్లో వైఎస్సార్ ను పెట్టుకున్న గుండెలన్నీ తల్లడిల్లిపోయాయి. అందులో కొన్ని గుండెలాగిపోయాయి. ఆ గుండెలను నమ్ముకుని గుడిసెల్లో బ్రతికిన కుటుంబాలన్నీ దిక్కులేని పక్షులైపోయాయి. అలాంటి వైఎస్సార్ అభిమానుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత వైఎస్సార్ కొడుకుగా జగన్ కి ఉందని భావించారు.

అప్పుడే ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఆ ఓదార్పు యాత్ర మొదలు వైఎస్ భారతికి బాధ్యతల భారం పెరిగింది. తండ్రి ఆశయం కోసం జగన్ పూలబాటను వదిలి ముళ్లబాటను పట్టారు. జగన్ వైఎస్సార్ అభిమానులందరికీ ముందుండి నాయకత్వం వహిస్తే.. కానీ ఆ జగన్ వెనుక మాత్రం వెన్నుదన్నుగా ఉండి కుటుంబాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు వైఎస్ భారతి. ఇద్దరు ఆడపిల్లలను దగ్గరుండి సాకాల్సిన తండ్రి జగన్... కోట్లాదిమంది ప్రజల తరఫున పోరాట జెండాను పట్టుకుని రంగంలోకి దిగితే... ఆ ఇద్దరి ఆడపిల్లలు హర్ష, వర్షాలకు... అమ్మ ప్రేమనే కాదు... నాన్న పెంపకాన్ని కూడా అందించిన వ్యక్తి వైఎస్ భారతి.

జగన్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించినందుకు అక్రమంగా కేసులు పెట్టి జైలులో నిర్భందించారు. ఆ క్షణం వైఎస్సార్ కుటుంబంలోని మహిళలంతా కన్నీటి సుడులు తిరిగిన కళ్లతో... సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడిగేందుకు నడిరోడ్డుమీదకు వచ్చారు. ఆ దృశ్యం యావత్ తెలుగు ప్రజల గుండెలని పిండేసింది. అంతటి కష్టాన్ని చూసిన వైఎస్ భారతి... అలాంటి స్థితిలో కూడా ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ వ్యాపార బాధ్యతలను, జగన్ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా ముందుకు నడిపించారు.

జగన్ నిరంతరం ప్రజల్లో ఉంటే... జగన్ ఉండాల్సిన ప్రతీ చోటా వైఎస్ భారతి ఉండి కుటుంబ, వ్యాపార బాధ్యతలు నిర్వర్తించారు. తొమ్మిదేళ్ల జగన్ పోరాటంలో... ఏడడుగులు నడిచిన వైఎస్ భారతి భాగస్వామ్యం ఎవ్వరూ వెలకట్టలేనిది. అందుకే తన భర్త వైఎస్ జగన్ మే 23, 2019 లో సాధించిన ఆ ఘన విజయాన్ని చూసి వైఎస్ భారతి గర్వపడ్డారు. 

అంతకుముందు తొమ్మిదేళ్లు అనుభవనించిన వేధింపులు, వెటకారాలు, అవమానాలు, అక్రమ నిర్బంధాలన్నింటినీ మర్చిపోయి ఆనందపడ్డారు. అంత గొప్పటి విజయం సాధించి సరిగ్గా ఏడాది కావడంతో వైఎస్ భారతి ఆ గొప్ప విజయాన్ని తన ఇంట్లో చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేశారు.

సీఎం జగన్ కూడా అధికారిక సమీక్షలేవీ నిర్వహించలేదు. సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, పిల్లలు హర్ష, వర్షలు చాలా సింపుల్ గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారట. ఉదయమే జగన్ సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, గత ఏడాది ఆరోజు పడ్డ టెన్షన్ ని, ఆత్రుతను గుర్తు చేస్తూ వైఎస్ జగన్ కి భారతి విషెస్ చెప్పారు. కుటుంబం అంతా ఆ రోజు జరిగిన మెమొరీస్ ని, అంతకుముందు ఎదుర్కొన్న సవాళ్లను, ఆ ఎన్నికల్లో పడ్డ కష్టాలను తల్చుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.