టీటీడీ ఆస్తుల విక్ర‌యంపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆస్తుల విక్ర‌యంపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

 

గ‌త కొన్ని రోజులుగా టీటీడీ ఆస్తుల‌ను అమ్మ‌బోతున్నార‌నే వార్తలు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే... అయితే దీనిపై టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ భూములు విక్ర‌యించ‌రాద‌ని తీర్మానం చేశారు.

 టీటీడీ ఆస్తులు, కానుక‌లు విక్ర‌యించ‌కూడ‌ద‌ని పాల‌క మండలి నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. నిర‌ర్థ‌క ఆస్తుల‌ను అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు క‌మిటీని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. గత పాలకమండలి నిర్ణయాలతో తమ ప్రభుత్వంపై బురదచల్లారని.. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

టీటీడీ ఆస్తుల‌ను విక్ర‌యిస్తున్నార‌నే దుష్ప్ర‌చారంపై విచార‌ణ జ‌రిపిస్తామ‌న్నారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు తెలిపారు. బోర్డుపై భవిష్య‌త్తులో ఇలాంటి ఆరోప‌ణ‌లు రాకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

డొనేషన్ల విధానంలో అతిథి గృహాలపై కేటాయింపు ఉంటుందని.. మార్గదర్శకాలు రూపొందించాలని టీటీడీ ఈవోను ఆదేశించామన్నారు వైవీ. మరోవైపు లాక్‌డౌన్ నిబంధనలు తొలగించాక భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. అవిలాల చెరువు అభివ్రుద్ధి పనులు తుడాకే అప్పగించాలని పాలకమండలి నిర్ణయించింది.. అలాగే ఇంజినీరింగ్ విభాగంలో 47 పోస్టుల భర్తీని వాయిదా వేశారు. ఇక తిరుమల గరుడ వారధికి నిధుల కేటాయింపులు చేయలేదు.