పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు “వరం”

0
126
ap govt announces extra amount for polavaram peoples
పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లకు అదనంగా రూ.75 వేలు ఇస్తున్నట్లుగానే.. గిరిజనేతర కుటుంబాలకు కూడా అదనంగా రూ.50 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.245.53 కోట్ల భారం పడుతుంది. దీంతో పాటు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ.15 వేలు అదనంగా ఇవ్వాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు. జనవరికల్లా 48 కాలనీలు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావసం, పరిహారానికి చెందిన సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిర్వాసితులు ప్రభుత్వం నిర్మించే గృహ విస్తీర్ణం కన్నా మరింత విశాలంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దన్నారు. వీలైతే బ్యాంకుల నుంచి వారు రుణాలు పొందేందుకు సహకరించాలని సూచించారు.
ప్రాజెక్టు 60% పూర్తి..
పోలవరం ప్రాజెక్టు 60 శాతం పూర్తయి మరో మైలు రాయిని అధిగమించిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీట్‌ పనులు జరిగాయని వెల్లడించారు. మట్టి పనులూ రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల దాకా జరిగాయన్నారు.