అసలే వేసవి కాలం.. ఇవి తిన్నారంటే అనారోగ్యం గ్యారంటీ !

summer tips

వేసవికాలం వచ్చిందంటే చాలు.. తాపం మొదలవుతుంది. ఈ ఏడాదయితే.. వేసవి తాపం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏప్రిల్ ఎంటరవ్వకముందే ఎండలు దంచికొట్టాయి. ఆ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన ఉక్కపోతతో నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటప్పుడే కాస్త చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కానీ.. అలాంటి వాటి వల్ల అనారోగ్యం తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు వైద్యులు. ఓ వైపు ఎండలు భయపెడుతుంటే.. మరోవైపు కరోనా చెలరేగిపోతుంది. ఇలాంటి సమయంలో చల్లటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. 

వేసవిలో ఏం తినాలి ? ఏం తినకూడదు ?

1. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఉదాహరణకి నిన్న వండిన కూర మిగిలితే.. అనవసరంగా పాడైపోతుందని ఫ్రిడ్జ్ లో పెట్టి.. మర్నాడు తింటుంటారు. అలా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. వండేటపుడే తక్కువగా వండుకుంటే మర్నాటికి ఫ్రిడ్జ్ లో ఉంచే అవసరం ఉండదు కదా. 

2. వేసవి తాపాన్ని, వేడిని భరించలేక చల్లటి నీరు, జ్యూస్, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంటుంది. అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో పెట్టిన నీరు తాగకపోవడమే మంచిది. అంతగా చల్లటి నీరే తాగాలనుకుంటే.. కుండలు వాడితే సరిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన నీటి కన్నా.. కుండలో చల్లబడిన నీరు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. 

3. మాంసం.. ఈ మండు వేసవిలో నాన్ వెజ్ కు కాస్త దూరంగా ఉంటే మంచిది. మాంసంలో కొవ్వు, ప్రొటీన్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.. ముఖ్యంగా రెడ్ మీట్ జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. దానికి కాస్త దూరంగా ఉంటే ఉదర సమస్యలు తలెత్తవు. 

4. చాలామందికి ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగకపోతే ఆ రోజంతా అదోలా ఉంటుంది. ఈ రెండూ కూడా శరీరంలో వేడిని పెంచుతాయి. వీటికి బదులు లెమన్ టీ, లెమన్ వాటర్ లేదా మజ్జిగ వంటివి తాగడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తాయి. 

5. ఫ్రై. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫ్రాన్స్, ఫిష్ ఫ్రై.. వెజిటబుల్స్ ఫ్రై.. ఇలా చాలా రకాల ఫ్రైలు తింటుంటాం. వేసవిలో వీటికి కాస్త బ్రేక్ ఇస్తే మంచిది. ఫ్రై పదార్థాలు ఎక్కువగా నూనెను పీల్చుకుంటాయి కాబట్టి అధికంగా దాహం వేస్తుంటుంది. అంతేకాక.. కడుపు ఉబ్బినట్లుగా.. నిండినట్లుగా ఉండటంతో పాటు జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే వేసవిలో ఫ్రై లకు కాస్త దూరంగా ఉండాలి. 

6. ఫాస్ట్ ఫుడ్.. దీనిని ఇష్టపడని వారుండరు. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా ఇలాంటి వాటికి ప్రీతిపరులెందరో ఉంటారు. ఈ పదార్థాలు కూడా ఉదరం పై ప్రభావం చూపిస్తాయి. ఫాస్ట్ ఫుడ్ వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఫాస్ట్ ఫుడ్ ను అవైడ్ చేస్తే మంచిది. 

7. వేసవిలో శరీరంలో వేడిని పెంచే ఆహార పదార్థాలు కాకుండా చలువచేసే వాటిని తీసుకుంటే మంచిది. దోసకాయ, సొరకాయ, టమోటా, ఆకుకూరలు వంటివి ఆహారంలో తీసుకుంటే మంచిది. 

8. నాన్ వెజ్ కు దూరంగా ఉండలేనివారు రొయ్యలు, చేపలు వంటివి తినొచ్చు. అవి సముద్రపు చేపలు, రొయ్యలు అయితే మరీ మంచిది. చెరువుల్లో ఎరువులు వేసి పెంచినవాటికన్నా సముద్రపు చేపలు ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. 

9. వేసవిలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. ఎండలో పనిచేసేవారు, బయటికి వెళ్లేవారిపై వీటిప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మజ్జిగ, లస్సీ, సబ్జా నీళ్లు, నిమ్మసరం వంటికి తీసుకుంటుండాలి. వీలున్నప్పుడల్లా మంచినీరు (ఫ్రిడ్జ్ లో పెట్టినవి కాదు) ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

10. వేసవిలో దొరికే రుచికరమైన పండు మామిడి. దీనిని ఇష్టపడనివారు చాలా తక్కువే ఉంటారు. కానీ.. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి రోజుకు ఒకపండు తీసుకుంటే చాలు. ఇంకా పండ్లు తినాలనిపిస్తే.. పుచ్చకాయ, కర్భూజా, ద్రాక్ష వంటి నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.