ప్రతీక : 5 చంద్రబాబు నాయుడు తప్పిదాలు

0
270

క్యాడర్ ను నమ్మకపోవడం 

నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఎంత అవసరమో, వాస్తవాన్ని నిర్మొహమాటంగా, ఎలాంటి ముసుగులు లేకుండా చెప్పడం కూడా అంతే అవసరం. ఇప్పుడు ఇక తెలుగు ప్రధాన మీడియా తనను తాను పునః పరిశీలించుకోవలసిన సమయం ఆసన్నమైంది. యాజమాన్యాలు, పాత్రికేయులు తమ స్వీయ అవసరాల నుంచి విషయాలను చూసే అలవాటు నుంచి పక్కకు రావాలి. ప్రజలతో మమేకమవ్వాలి. తెలంగాణ ఫలితాలను హుందాగా అంగీకరించడం ప్రజాస్వామిక సమాజం అత్యున్నత స్థాయికి అద్దంపడుతుంది.

ప్రాంతీయ సమస్యలను పట్టించుకోకపోవడం

చంద్రబాబు తెలిసి తెలిసి చాలా సార్లు తప్పటడుగు వేస్తారు. ఇప్పుడు జరిగిందీ అదే. తన చుట్టూ ఉన్న కోటరీని నమ్మకూడదని అనేకానేక గుణపాఠాలు వచ్చినా, అదే పని చేస్తూ పోతున్నారని ఈ ఎన్నికలలో మరోసారి నిరూపితమైంది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు వద్దని, విడిగానే పోటీ చేయమని నెత్తీ నోరు కొట్టుకొని చెప్పిన నిఘా వర్గాల మాట కానీ, నేలమీద నిలబడి చెప్పిన మైనారిటీ నేతల మాట కానీ కనీసం చెవిలోకెక్కించుకోకుండా ముందుకు పోయారు. స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంలో ఘోరంగా విఫలమవుతూ వచ్చారు. చుట్టూతా చేరిన భజనపరులు వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేయడం కూడా అధినేత వైఫల్యానికి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో పటాటోపం ఎక్కువై హుందాతనం లోపిస్తే జరిగే నష్టం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గుర్తిస్తే మంచిది. ఒద్దికగా ఉంటూ లక్ష్యం దిశగా సాగడం విజ్ఞుల లక్షణం.

స్తానికంగా ప్రజల అందుబాటులో ఉండే నేతలను విస్మరించడం

తెలంగాణ ఎన్నికలు ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలకి అద్ధం పట్టాయా? లేదా? అన్న విషయాన్ని కేవలం ఫలితాల ఆధారంగానే నిర్ధారించలేం. కానీ కొన్ని విషయాలను మాత్రం విస్పష్టంగా ప్రకటించుకోవచ్చు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయకుండా సమీప భవిష్యత్తులో ఏ నేతా ఎన్నికలలో గెలవలేడన్న విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. జనంలో ఉంటూనే ఓటేసే రోజున డబ్బులు చేతిలో పెట్టాల్సిందే అన్న సత్యాన్ని నిస్సిగ్గుగా ఓటరు తేల్చి చెప్పాడు. ఓటుకు కనిష్టంగా 1500 నుంచి గరిష్ఠంగా 5000 రూపాయిలు పంచిపెట్టిన తెలంగాణ నేతలు మిగిలిన రాష్ట్రాలకు ఓ బెంచ్ మార్క్ ని సృష్టించారు. అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం ద్వారా ఏ స్థాయిలోని అధికారినైనా చాపకింద నీరులా ఉపయోగించుకోవచ్చని కేసీఆర్ బలంగా నిరూపించారు. తిరుగులేని పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ స్వరం ఫలితాలు పూర్తికాకముందే పదునెక్కింది.

ఇప్పటికి  తెలంగాణ సెంటిమెంటే ఉందని గ్రహించకపోవడం

ఆంధ్రా నేతల పట్ల తెలంగాణ సమాజంలో ఉన్న వ్యతిరేకత, ద్వేషం సజీవంగానే ఉందన్న విషయం తేటతెల్లమయ్యింది. ఆ సమాజంలో ఉన్న ఐక్యతారాగం మరోసారి శ్రావ్యంగా టీఆర్ఎస్ ఇంట మోగింది. కేసీఆర్ హెచ్చరికను తక్కవ చేయడానికి వీలులేదు. చంద్రబాబుపై కత్తి కట్టినట్లు తెలంగాణ సీఎం మొదటి పాత్రికేయ సమావేశంలోనే వెల్లడైంది. దానికితోడు సాయం చేసిన వారిపట్ల కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఏ మాత్రం మొహమాటపడని ఆయన వ్యవహారశైలి పవన్, జగన్ లకు వరమవ్వబోతోంది. తెలంగాణ ఫలితాలను పరిశీలించిన తరువాత ఏపీలో ఇప్పటి వరకూ ముసుగులో ఉన్న పార్టీలు ఇక బహిరంగమై పొత్తులు దిశగా పయనించే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

ప్రజల ఆంకాక్షను మీడియా ప్రభావితం చేయదు అని నమ్మకపోవడం

తెలంగాణ ఫలితాల తరువాతైనా చంద్రబాబు వెంటనే మేలుకుంటే మంచిది. ఆర్టీజీఎస్ అనే మయసభ చెప్పే సంతృప్తి శాతాలను, భజనకారుల్లా మారిన నేతలు, అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికలను నమ్మడం ఇప్పటికైనా చంద్రబాబు మానేస్తే ఆయనకే మంచిది. లేకపోతే పదవి కోల్పోయే ప్రమాదాన్ని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. జగన్ పై ప్రజలు పెద్ద నమ్మకాన్ని పెట్టుకోకపోయినా జనసేనాని తన సత్తా చూపించే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదని కూకట్ పల్లి నియోజకవర్గం నిరూపించింది. కులాల వారీ విభజితమైన ఆంధ్రా ప్రాంతం రాజకీయంగా తమతమ కులాల నేతలతో అంటకాగబోతోంది. ఇప్పుడు ప్రతి కులమూ రాజ్యాధికార కాంక్షతో రగిలిపోతోంది. దీనిని ఎవ్వరమూ తప్పపట్టలేం.

తెలుగుదేశం పార్టీ మరీ అంత పుష్టిగా ఏమీ లేదని, లుకలుకలు, అభిప్రాయ బేధాలు బలంగానే పార్టీలో ఉన్నాయన్న విషయం రాయలసీమకు చెందిన సీనియర్ నేత మాటలతో వెల్లడవుతోంది. ప్రజాభిప్రాయాన్ని మీడియా పెద్దగా ప్రభావితం చేయలేదని, నవ్యాంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతల మధ్య సారూపత్యలు పెద్దగా లేకపోవడంతో భవిష్యత్తులో అగాధాలు పెరిగే అవకాశం అధికంగా ఉందని అర్థమవుతోంది. నిలకడైన అభివృద్ధి, ఫలాల సమభాగస్వామ్యం, చైతన్యవంతమైన సమాజ సృష్టి మాత్రమే ఇప్పుడు నేతల ముందున్న ఆచరణాత్మక మంచిప్రత్యామ్నాయం. బహుశా సాకారం కాని కలకూడా.