రాహుల్‌ గాంధీతో భేటీ కానున్న చంద్రబాబు..!!

0
279
Chandrababu meets with Rahul gandhi

దిల్లీ వేదికగా భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో అడుగేశారు. ‘జాతిని రక్షిద్దాం… ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం’ అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం కట్టిన ఆయన కాంగ్రెస్‌నూ అందులో భాగస్వామిని చేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా కాంగ్రెస్‌తోనూ చేతులు కలుపుతారా? అని ఇన్నాళ్లూ నెలకొన్న సందేహానికి తెరదించారు. ఇందులో భాగంగానే గురువారం దిల్లీ వేదికగా కీలక ఘట్టానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ కాబోతున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాహుల్‌ గాంధీ, చంద్రబాబు మొదటిసారి ఒకే వేదికపైకి కనిపించారు. ఇప్పుడు వారిద్దరూ ముఖాముఖి సమావేశం కానున్నారు.  రాహుల్‌ గాంధీతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, సీతారాం ఏచూరి వంటి సీపీఎం అగ్ర నాయకులతోనూ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ తదితరులతోనూ భేటీ అవుతారు.

దిల్లీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తదితరులతో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలసి పని చేయాలన్న తెదేపా నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఎలా స్వీకరిస్తారన్న అంశంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌, తెదేపాలు రెండూ కలసి పోటీ చేస్తుండటంతో ప్రజల్లో ఒక స్పష్టత వచ్చిందని, తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చినందున జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీతో కలసి పని చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సానుకూలంగానే చూస్తారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.

Rahul gandhi ‘‘తెలంగాణలో మహా కూటమిలో ఇప్పటికే కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తున్నాం. ఈ అనివార్యతను ప్రజలు, కార్యకర్తలు అర్థం చేసుకొన్నారు. ఇందులో ఇబ్బందేమీ లేదు’’ అని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు. వయసులో చిన్నవాడైన రాహుల్‌ తానే చంద్రబాబు వద్దకు వచ్చి కలిస్తే బాగుండేదేమోనని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. దీనికి చంద్రబాబు నవ్వేశారు. ‘‘చిన్న పార్టీల వద్దకు కూడా నేను స్వయంగా వెళ్లి మాట్లాడుతున్నాను. వాటితో పోలిస్తే కాంగ్రెస్‌ పెద్ద పార్టీ. వెళ్లి మాట్లాడితే వారి మనసులో భావాలు తెలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇది కాంగ్రె్‌సకు దగ్గర కావడం కాదని, బీజేపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కలిపే ప్రయత్నమని ఆయన చెప్పారు. కేంద్రం నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యత సాధించేందుకు కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని పోవడం రాజకీయ అనివార్యతగా మారింది. ఇది కాంగ్రెస్‌కు దగ్గర కావడం కాదు. బీజేపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ కలిపే ప్రయత్నం. దీనిపై ప్రజలకు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలి.