ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారిన ఫాం 7 దరఖాస్తులు

0
314
ఏపీ రాజకీయం జనాలనే కాదు ఎన్నికల సంఘానికీ ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఓట్ల తొలగింపు కోసం ఫాం 7 దరఖాస్తుల వ్యవహారం ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారిందట. ఓట్లను తొలగించాలంటూ చేసిన దరఖాస్తుల్లో దాదాపు లక్షా 55 వేలకు పైగా నకిలీ దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కల్లో స్పష్టమైంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 8 లక్షల 7 వేల దరఖాస్తులను పరిశీలన వారీగా చేపడుతున్నామని ఈసీ క్లారిటీ ఇచ్చింది. అయితే తొలి విడతగా లక్షా 61 వేల 5 దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం అందులో 5309 దరఖాస్తులే నిజమైనవి తేల్చింది. మిగిలినవన్నీ ఉద్దేశ పూరకంగా వచ్చిన ఫాం 7 దరఖాస్తులని గుర్తించింది. అంటే… లక్షా 55 వేల 696 దరఖాస్తులు నకిలీవని తేలిపోయింది. అంటే… జనవరి 11వ తేదీ తర్వాత ఏపీలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని అర్థం అవుతోంది. ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు చెబుతోంది కూడా ఇదే. కానీ ఇది పట్టించుకునే పరిస్తితిలో ఏపీలోని పార్టీలు లేవనేదే ఇప్పుడు ఎన్నికల సంఘం బాధ.
 
మరో విషయం ఏంటంటే… నకిలీ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కేసులు పెడుతోందని తెలియగానే ఫాం 7 దరఖాస్తులు రావడం ఆగిపోయాయని ఈసీ గుర్తించింది. ఇదంతా తెల్సినా ఇప్పుడు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం మీదే ఎన్నికల సంఘం అధికారులు మండిపడుతున్నారు. తామేదో తప్పు చేసినట్లు ఏపీలోని పార్టీలు ప్రచారం చేయడం సరికాదని చెబుతున్నారు. ఎన్నికల వేళ ప్రజలను రాజకీయ పార్టీలు గందరగోళానికి గురి చేయడం సరికాదంటున్నారు.