గూగుల్ VS ఆస్ట్రేలియా.. ఇంతకీ వివాదమేంటి ?

Google VS Australia

గూగుల్ కి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వివాదం నడుస్తోంది. ఆ దేశంలో తమ సేవలను నిలిపివేస్తామని, సెర్చింజన్ ను ఆపేస్తామని గూగుల్ హెచ్చరిస్తే.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇంతకీ గూగుల్ కి ఆస్ట్రేలియాకి మధ్య వచ్చిన వివాదం ఏంటో చూద్దాం. 

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం న్యూస్ మీడియా చట్టాన్ని ప్రతిపాదించగా.. ఆ వార్తలను పబ్లిష్ చేస్తున్నందుకు గూగుల్ ఆయా వార్తా సంస్థలకు నిధులిస్తోంది. గూగుల్ తో పాటు ఫేస్ బుక్ కూడా తమ పబ్లిషర్లకు నగదు చెల్లిస్తోంది. కాగా.. ఆస్ట్రేలియా సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం అంత మంచిది కాదని, అదే గనుక వస్తే తాము దేశం విడిచి వెళ్లిపోతామని ఆస్ట్రేలియా గూగుల్ మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా సర్కార్ ను హెచ్చరించారు. 

అయితే గూగుల్ బెదిరింపులకు తలొగ్గేది లేదని, మా దేశంలో ఎవరేం చేయాలో తామే నిర్ణయిస్తామని ప్రధాని స్కాట్ మోరిసన్ ధీటుగా బదులిచ్చారు. ఆయన సమాధానానికి స్పందించిన సిల్వా తామేమి బెదిరించడంలేదని, చేసేదే చెప్తున్నామన్నారు. అయినా మరొక్కసారి ఆ చట్టాన్ని చదివి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సిల్వా పేర్కొన్నారు.