ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు అధికం.. వైద్యుల హెచ్చరిక !

gum disease

కరోనా సెకండ్ వేవ్ ! అందరినీ ముప్పతిప్పలు పెడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో దేశంలో 10 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య రెండు లక్షలు దాటేసింది. పెరుగుతున్న కేసులు కరోనా సెకండ్ వేవ్ కు అద్దం పడుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపై కరోనా ఎఫెక్ట్ ఉంటుందని గతంలోనే వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నారు డాక్టర్లు. చిగుళ్ల వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు అధికంగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధితో కరోనా త్వరగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని డాక్టర్ గౌడ్స్ డెంటల్‌ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్‌ వికాస్‌గౌడ్‌ వెల్లడించారు. 

నోటిలో చిగుళ్లు చెడిపోయినప్పుడు వైరస్ ఊపిరితిత్తుల్లోకి లేదా.. నేరుగా రక్తంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా దీనిపై అంతర్జాతీయ జర్నల్స్ పరిశోధనలు చేస్తుండగా.. ఆ సమాచారాన్ని క్రోడీకరించి వికాస్ గౌడ్ ఈ వివరాలను తెలియజేశారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ల వాపు ఉన్నా కరోనా వైరస్ తీవ్రత అధికమవుతుందని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని వికాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నోటి పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటే మంచిదని సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్, షుగర్ వ్యాధిగ్రస్తులతో పాటు పొగాకు, గుట్కా ఎక్కువగా తినేవారిపై కరోనా ప్రభావం ఉంటుందని, వారంతా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం క్షేమమని తెలిపారు.