హైకోర్టులో మాజీ మంత్రి ఈటలకు ఊరట..

high-court-stays-on-govt-actions-over-eatala-issue

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై నమోదైన భూకబ్జా ఆరోపణలపై ఆయనకు ఊరట లభించింది. జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఈ సందర్బంగా న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈటల భూముల్లో సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంటే.. ఆయనకు ముందుగా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈటల భూముల వ్యవహారంలో అధికారుల తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది.  పూర్తి ఆధారాలతో కలిపి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 6కి వాయిదా వేసింది.