మహిళల సీట్లలో ఇతరులు కూర్చుంటే రూ.500 జరిమానా..!!

0
135
hyderabad metro

మెట్రో రైళ్లలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే జరిమానా విధించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేకించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే రూ.500 జరిమానా వేస్తామన్నారు. ప్రతీ బోగీలో ఎల్‌అండ్‌టీ భద్రతా సిబ్బంది, పోలీసు నిఘాను అధికం చేస్తామని వివరించారు. ఈ విషయంలో మహిళా ప్రయాణికులు తమకెదురయ్యే అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ఓ వాట్సాప్‌ నంబరును కేటాయించాలని ఆయన అధికారులకు సూచించారు. మెట్రోస్టేషన్ల పరిసరాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్‌ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు సభ్యులు గల టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, పోలీసు అధికారులతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌, నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు మెట్రో మార్గంలోని స్టేషన్లలో పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వి.పి. రెడ్డి, ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌ సహాని, చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆనందమోహన్‌, హైదరాబాద్‌ మెట్రోరైలు ఉన్నతాధికారులు విష్ణువర్ధన్‌, బి.యన్‌ రాజేశ్వర్‌, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.