సమరానికి సై భారత్ పాకిస్తాన్

0
142
india vs pakistan match today

ఏడాది విరామం తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. భారత్‌, పాక్‌ మధ్య చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని నేపథ్యంలో రెండు జట్లు తలపడే అరుదైన మ్యాచ్‌లనూ ఏ క్రికెట్‌ అభిమానీ చూడకుండా వదలడు. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులందరూ ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తారు. తాజా పోరు మరింత ఆసక్తి రేకెత్తించడానికి కారణాలున్నాయి. ఇంతకుముందు బలహీనంగా ఉన్న పాక్‌.. గత ఏడాదిలో బలంగా తయారైంది. భారత్‌కు సమవుజ్జీగా మారింది. చివరగా గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో రెండు జట్లూ తలపడగా.. భారత్‌పై పాక్‌ భారీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు పాక్‌ను ఓడించడం భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. బ్యాటింగ్‌ మూల స్తంభం కోహ్లి లేకుండా బరిలోకి దిగుతున్న భారత్‌.. పాక్‌పై ఎలా ఆడుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. హాంకాంగ్‌పై పాక్‌ సునాయాసంగా గెలవగా.. భారత్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. చాన్నాళ్లుగా వేధిస్తున్న మిడిలార్డర్‌ సమస్య ఈ మ్యాచ్‌లోనూ కనిపించింది. హాంకాంగ్‌ లాంటి జట్టుపైనే అలా ఆడితే బలమైన బౌలింగ్‌ దళమున్న పాక్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారో చూడాలి. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ ఎలాంటి ఆరంభాన్నిస్తారన్నది కీలకం. మిడిలార్డర్లో ధోని నిలబడి ఆడాల్సి ఉంది. హాంకాంగ్‌పై సత్తా చాటిన రాయుడు.. పాక్‌పైనా రాణిస్తాడని జట్టు ఆశిస్తోంది. హాంకాంగ్‌పై బౌలర్లూ నిరాశ పరిచారు. తొలి మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయం. బుమ్రా, భువనేశ్వర్‌లపై చాలా బాధ్యత ఉంది. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటారన్నది ఆసక్తికరం.