3 నుంచి ప్రారంభం కానున్నకేసీఆర్‌ సభలు..!!

0
106
KCR meetings to start from oct 3

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. వచ్చే నెల మూడో తేదీ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాల వారిగా వీటిని నిర్వహిస్తారు.  దీని ప్రకారం మూడో తేదీన ఉమ్మడి నిజామాబాద్‌లో, 4న ఉమ్మడి నల్గొండలో, 5న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో, 7న ఉమ్మడి వరంగల్‌, 8న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీటిని నిర్వహిస్తారు. నిజామాబాద్‌లో మూడో తేదీన  ప్రజాఆశీర్వాద సభ పేరిట దీనిని నిర్వహిస్తారు.

దీనిపై సీఎం మంగళవారం చర్చించారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర ముఖ్యనేతలు ఇందులో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజక వర్గాలు- అర్బన్‌, రూరల్‌, బోధన్‌, ఆర్మూరు, బాన్స్‌వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండ, జుక్కల్‌ల నుంచి ఈ సభకు జనసమీకరణ చేయాలని సీఎం సూచించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. గిరిరాజ్‌ కళాశాల మైదానం లేదా నగర శివార్లలోని 37 ఎకరాల స్థలంలో దీనిని నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. బుధవారం స్థల పరిశీలన జరిపి, వేదికను ఖరారు చేస్తారు. సభా నిర్వహణపై బుధవారం నిజామాబాద్‌లో ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు.