ప్రణయ్ హత్యపై స్పందించిన మంచు మనోజ్

0
230

ప్రణయ్‌, అమృత కులాంతర వివాహం చేసుకున్నప్పటి నుంచి కక్షతో రగిలిపోతున్న అమ్మాయి తండ్రి మారుతీరావు… ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించిన ఘటన తెలిసిందే. దీనిపై తాజాగా మంచు మనోజ్ ఓ భావోద్వేగ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

‘‘మానవత్వం కంటే కులం, మతం గొప్పవని భావించే ప్రజల కోసం ఈ లేఖ. ఏ ఫీల్డ్‌లో అయినా కుల పిచ్చి.. దానిపై ఆధారపడిన సినీ నటులు(ఫ్యానిజం), రాజకీయ పార్టీలు, కాలేజ్ యూనియన్లు, కుల, మత సంస్థలు అన్నీ అనాగరికమైనవి. కులాన్ని సమర్థించే వారంతా ప్రణయ్, అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న జుగుప్సాకరమైన దాడులకు బాధ్యత వహించాలి. జీవిత విలువను ముందుగా మీరు తెలుసుకోవాలి. ఇంకా లోకాన్నే చూడని పసికందు… తన తండ్రి స్పర్శను తెలుసుకోకముందే… అతని చేతిని పట్టుకోకముందే… తండ్రిని కోల్పోయింది.

మనందరికీ హృదయం, శరీరం ఒకే తీరుగా ఉన్నాయి. మనమంతా ఒకే గాలిని పీలుస్తున్నాం… ఒకే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటపుడు కులం పేరుతో ఈ వివక్ష ఎందుకు? మనం అంతా ఒక్కటేనని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? కులాన్ని ప్రేమించేవారు, సపోర్ట్ చేసేవారిని చూసి సిగ్గుపడాలి. కులపిచ్చిని రూపుమాపుదాం! ఇదొక నివారించాల్సిన పెద్ద రోగం. కాస్త కళ్లు తెరచి.. మనుషుల్లా ప్రవర్తించండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తున్నా. మన పిల్లలకు మంచి సమాజాన్ని అందిద్దాం. ప్రణయ్ భార్య అమృత, అలాగే అతని కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. ప్రణయ్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. మీ ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Manoj wrote a letter

Manchu Manoj wrote a latter on pranay murder