భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ రాజీనామా

0
135
nikki haley resign
క్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి, భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ(46) తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. నిక్కీ రాజీనామాను అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించారు. అమెరికాలో మరికొద్ది రోజుల్లో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిక్కీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్వేతసౌధంలోని తన కార్యాలయంలో నిక్కీతో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ఆమె అద్భుతంగా పనిచేశారని, ఈ ఏడాది చివరలో పదవిని వీడతారని చెప్పారు. రాజీనామా విషయాన్ని నిక్కీ ఆర్నెల్ల కిందటే చెప్పారని, తానే కొద్దిగా సమయం తీసుకున్నానని ట్రంప్‌ విలేకర్లతో అన్నారు. ఆమె తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. రెండేళ్ల కిందట ఈ పదవిని చేపట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపారని, నిక్కీ మాత్రం పదవికే వన్నె తెచ్చేలా పనిచేశారని ప్రశంసించారు.
అయితే ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష పదవికి నిక్కీని ట్రంప్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. కానీ, ఆమె మాత్రం 2020లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడబోనని, ట్రంప్‌ తరఫునే ప్రచారం చేస్తానని తేల్చిచెప్పారు. ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్న నిక్కీ.. గడిచిన రెండేళ్లలో ట్రంప్‌ ప్రభుత్వం ఐరాసలో సాధించిన కీలక విజయాలను వివరించారు. ట్రంప్‌ ప్రభుత్వంలో నిక్కీ అత్యంత సీనియర్‌ భారతీయ అమెరికన్‌ అధికారి. నవంబరులో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో నిక్కీ రాజీనామా తమను దిగ్ర్భాంతికి గురి చేసిందని నిపుణులు పేర్కొన్నారు.