చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

tdp mls fires on chandrababu naidu

టీడీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కలిశానని, సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకత్వం దీనికి కూడా తప్పుబట్టడం సరికాదని, సీఎం కలిసినందుకు తన అనుమతి లేకుండా నియోజకవర్గానికి మరో ఇంచార్జ్‌ని నియమించారని విమర్శించారు. గత నాలుగు రోజులుగా తనకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి గురువారం బహిరంగ లేఖ రాశారు.

‘టీడీపీ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశాను. స్థానిక సమస్యలు వివరించాను. సీఎం వెంటనే స్పందించి రూ. 25 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి దగ్గరకి ఎందుకు వెళ్లారని ఒక్కమాట కూడా అడగకుండా.. ఇంచార్జ్‌గా మరో వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏంటి?. ప్రజల కోసం సీఎం ని కలిస్తే తప్పేంటి? నా వివరణ కోరకుండా ఇంచార్జ్‌ని నిమించాల్సిన అవసరం ఏంటి?. వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎందుకు నియమించలేదు?. కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో ఇంచార్జ్‌ని ఎందుకు నియమించలేదు?. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు. జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 9 సీట్లు ఒక సామాజిక వర్గానికే కేటాయించారు. ఎన్‌టీఆర్‌ స్థాపించిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అట్టిపెట్టుకుని ఉంటే ఇదేనా మీ ప్రవర్తన. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన నలుగురు విశాఖ ఎమ్మెల్యేలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీ పార్టీలో నాయకులు బయటకు వెళితే వారి ఇళ్ళపైన దాడులు చేస్తారా.? ’అని లేఖలో పేర్కొన్నారు.