*పలాస 1978 * రివ్యూ

*పలాస 1978 * రివ్యూ

 

 

బ్యానర్  : సుధస్ మీడియా
సమర్పణ : తమ్మారెడ్డి భరద్వాజ్
కెమెరా :  విన్సెంట్ అరుల్
మ్యూజిక్  : రఘు కుంచె
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడ్యూసర్ :  ధ్యాన్ అట్లూరి
డైరెక్టర్ : కరుణ‌ కుమార్

ఆర్టిస్ట్స్ : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తీరువీర్, మాధవి

 

 

కధ ఒక్క ముక్కలో...

1978 వ కాలంలో  పలాస పక్కన ఓ గ్రామంలో కాలనీలో ఉండే రంగారావు, మోహన్‌రావు అనే ఇద్దరు అన్నదమ్ములు.. వారు జానపద కళాకారులు. ఊరిలో పెద్ద షావుకారు, చిన్న షావుకారు వాళ్ళ జీడిపిక్కల వ్యాపారంలో వెట్టి చాకిరి చేయించుకోవడం.. రాజకీయంగా ఎదగడం కోసం వీళ్ళని వాడుకోవడం. అగ్ర‌కులాల‌కు అణ‌గారిన వ‌ర్గాల‌కు మ‌ధ్య అంత‌రాన్ని ప్ర‌శ్నించే క్ర‌మంలో మోహనరావు ఎదురుతిర‌గ‌డం.

 

విషయానికి వస్తే..

మేము కాలికి గజ్జె కట్టి ఆడేవాళ్లం కత్తి పట్టేటోళ్లం కాదు అని హీరో పాత్ర మోహన్‌రావు (రక్షిత్) అంటాడు, కానీ కత్తి తోనే ఎక్కువ సావాసం చేస్తాడు. టైటిల్ లోనే 1978 వేశారు కాబట్టి అప్పటి వాతావరణం, అప్పట్లో అణగారిన కులాలపై జరిగిన అన్యాయం మెయిన్ పాయింట్ గా దర్శకుడు తీసుకున్నాడు. ఉద్దేశం నిజంగా అభినందించద‌గ్గ విషయం కానీ ఒక కల్ట్ సినిమాగా ఒక ఆర్ట్ సినిమాగా కథ‌ని నడిపాడు.  ఇలాంటి కథలు తెలుగు వారికి కొత్త కాదు. గతంలో మా భూమి, దాసి లాంటి సినిమాలు నరసింగరావు లాంటి దర్శకులు మనకి  చూపించారు. అలాగే  నారాయణ మూర్తి గారు చాలా సినిమాలు తీశారు తీస్తూనే ఉన్నారు.  ఇలాంటి  సినిమాలు కమర్షియల్ గా ఎంతవరకూ మెప్పిస్తాయో తెలిదు గానీ క్రిటిక్స్ మాత్రం మెచ్చుకుంటారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు పా.రంజిత్ తన భావాలను సినిమా రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి భావాన్నే దర్శకుడు కరుణ కుమార్ అనుసరించే ప్రయత్నం చేసాడు.  కానీ అనుకున్నంత ఫీల్ రప్పించలేక పోయాడు. తమిళ సినిమా పెరియాలుమ్ పెరుమాళ్ చిత్రంలో హీరో అంబేద్క‌ర్ భావాలతో లాయర్ అవ్వాలని చదువుతుంటాడు. అగ్రకులం వాళ్ళు హీరోని అవమానించే తీరు, తన తండ్రిని అవమానించే విధానం మామూలు ప్రేక్షకుడికి కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి. 
 
కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమి కనిపించవు. అన్నీ ప్రేక్షకుడికి తెలిసిన సీన్లే రన్ అవుతుంటాయి. మధ్య మధ్యలో ఎనభైల్లో కి సినిమా వెళ్తుంది.. ప్రస్తుతం అని కూడా రన్ అవుతుంది. ఇది ప్రేక్షకులకు కొంచెం కన్ఫ్యూజన్ కి గురి చేస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ రంగస్థలం సినిమా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే హిందీ దర్శకుడు అనురాగ్ కశ్య‌ప్ ప్రభావం కూడా బాగా ఉన్నట్టుంది డైలాగులు అలాగే వాడేశారు. ఆ సినిమాల్లో షాట్స్ కూడా కలెక్ట్ చేసిపెట్టుకున్నట్టున్నాడు, అలాగే వాడేశారు. దర్శకుడు కరుణ‌ కుమార్ హీరో బలహీన వర్గానికి చెందిన వాడు అని చెప్తూనే, బలవంతుడిగా చూపిస్తాడు. బలవంతులు అని చూపించిన షావుకారులు ఎప్పుడూ హీరోకి భయపడుతూ ఉంటారు,  తన్నులు తింటూ వుంటారు.  దానివల్ల హీరో సైడ్ పెయిన్ కి ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.  ఊరికి పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన పాత్ర తో చాలా మంచి విషయాలు చర్చిస్తాడు. హింస మార్గం కాదు అని అంబేద్క‌ర్ విగ్రహం ఆదర్శం ఆయన చేతిలో పుస్తకం భవిషత్తు, ఆయన చూపించిన వేలు మార్గం అని, కానీ అదే ఆఫీసర్ తో మళ్ళీ కత్తి పట్టు అని చెప్పిస్తాడు. మొత్తానికి సినిమా మొదటి భాగం పర్వాలేదు అనిపించినా, సెకండాఫ్ పలాస వెళ్లే ప్యాసింజర్ రైలు లా అలా సాగుతూ వెళ్ళింది. డైలాగులు బాగున్నాయి, ఆలోచించే విధంగా ఉన్నాయి. నటీనటులు పెర్ఫార్మన్స్ అందరూ బాగా చేశారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు అంటే చాలా సీనియర్ మరి సెకండ్ ఆఫ్ ఎందుకు అలా వదిలేసారో.. కొంచెం ట్రిమ్ చేసుంటే బావుండేది.సంగీతం ఒక పాట తప్ప మాట్లాడుకోవడానికి ఏం లేదు. నిర్మాతకి చాలా క్లారిటీ ఉన్నట్టుంది, ఎంత ఖ‌ర్చుపెట్టాలో అంత మాత్రమే పెట్టారు. ఓవర్ ఆల్ గా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవచ్చు కానీ ప్రేక్షకులు ఆశించింది మాత్రం దొరక్కపోవచ్చు. ఫస్టాఫ్ లో కొద్దిగా పస ఉన్నట్టు అనిపించినా సెకండాఫ్ బొత్తిగా నస అనే ఫీలింగ్ రావొచ్చు. 

 

చివరిగా...
పలాస ఓన్లీ సిక్కోలు యాస.

 

రేటింగ్ : 2.75