ఎన్నికల కోడ్‌ ముగిసింది: సీఈవో

0
188
Rajath-kumar-meets-Governor-narasimhan

శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు సమర్పించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ముగిస్తున్నామని, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సైతం ముగిసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. 

లక్షల ఓట్ల గల్లంతు అవాస్తవం..

22 లక్షల ఓట్లు గల్లంతైనట్లు మీడియాలో, సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు 2016లోనే తొలగింపునకు గురయిందని, ఆ తర్వాత ఆమె మళ్లీ నమోదు చేసుకోలేదని వివరించారు. ఓటర్లు ప్రతి ఏటా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో, లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. అడ్రస్‌ మారినా, ఇతర చోటుకు మకాం మార్చినా.. ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈ డిసెంబరు 31వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇక ఎన్నికల్లో పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు సమర్పిస్తే.. పరిశీలించి ఐటీ అధికారులకు నగదు ఇస్తామని సీఈవో అన్నారు.

విజయవంతంగా ఎన్నికల నిర్వహణ

ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిందని సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలు విజయవంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించామన్నారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటరు నమోదును ప్రారంభిస్తామని, ఓటరు జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు. జాబితాలో కొందరి పేర్లు లేవంటున్నారని, కానీ.. పెద్దమొత్తంలో పేర్లు లేకపోతే శాంతిభద్రతల సమస్య వచ్చేదని అన్నారు. పారదర్శకంగా నిర్వహించడం వల్లే ఇబ్బందులు రాలేదని రజత్‌కుమార్‌ గుర్తు చేశారు. 

ఫలితాలపై గెజిట్‌ నోటిఫికేషన్‌ 

రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 88 టీఆర్‌ఎస్, 19 కాం గ్రెస్, 7 ఎంఐఎం, 2 టీడీపీ, చెరొక బీజేపీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి పేర్లతో జాబితాను ఇందులో పొందుపరిచింది.