నేడు తొలిసారిగా రాష్ట్రానికి రాబోతున్న సోనియా గాంధీ

0
181
sonia gandhi public meeting

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం హోరెత్తించబోతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బహిరంగ సభతో ప్రచార హోరును మరింత ఉధృతం చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌ పాల్గొంటున్న సభను తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ స్థాయిలో జనసమీకరణతో సభ విజయవంతం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తున్నారు.

తెలంగాణకి తొలిసారి

రాష్ట్రం అధికారికంగా ఏర్పాటైన తర్వాత తొలిసారి సోనియా రాష్ట్రానికి వస్తుండటంతో కాంగ్రెస్‌ కేడర్లో నూతనోత్తేజం నెలకొంది. ప్రతీ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, బూత్‌ స్థాయి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో రావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అదే విధంగా రాహుల్‌కు సైతం సన్మానం చేయనున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్‌ బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ టీపీసీసీ ముఖ్య నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తారు. అక్కడి నుంచి 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6గంటల కల్లా మేడ్చల్‌లోని బహిరంగ సభకు చేరుకుంటారు. సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగం చేయనున్నారు. రాహుల్‌ 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 116 పేజీల కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను సోనియా ఆవిష్కరించనున్నారు.