కర్నూలు టీడీపీలో వింత పరిస్తితి

0
67

కర్నూలు టీడీపీలో వింత పరిస్తితి నెలకొంది. ఇప్పటి దాకా ఎవ్వరూ ఊహించని విధంగా ఏళ్ల తరబడి శత్రువులుగా కొనసాగిన కోట్ల, కే.ఈ. కుటుంబాలు ఒకే వేదిక మీద, ఒకే పార్టీ జెండా పట్టుకుని సరికొత్త రాజకీయానికి తెర తీశాయి. వర్గ పోరాటాలతో జిల్లా వాసులను హడలెత్తించిన ఈ రెండు కుటుంబాలు… ఏపీ సీఎం చంద్రబాబు సాక్షిగా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. జిల్లా వాసులకు ఇది ఊహించని పరిణామం అయితే… వైసీపీకి కల్సొచ్చే అంశంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం ఒక్కటే. రెండు బలమైన శత్రు శిబిరాలు ఒక తాటి మీదకు రావడం అంటే, పాత వైషమ్యాలు మర్చిపోయినట్లు కాదు. అప్పటికి… ఆ తర్వాత కొన్నాళ్ల వరకూ కొత్త గొడవలు పుట్టుకు రావని చెప్పడం మాత్రమే. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో కోట్ల, కే.ఈ వర్గాలు ఇదే తరహా రాజకీయం నడుపుతున్నాయి. మొదట్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరికను ఒప్పుకోని కే.ఈ. క్రిష్ణమూర్తికి… ఆ తర్వాత వాస్తవం బోధ పడింది. జగన్ పార్టీ తన సొంత నియోజకవర్గంలో కూడా బలంగా మారింది. తన కుమారుడు పోటీ చేసినా ఓడిపోయే పరిస్తితి వచ్చిందన్న అనుమానం కే.ఈ.కి వచ్చింది. ఇదే సమయంలో కోట్ల వర్గం పరోక్షంగా జగన్ వైపు వెళ్తే… తన ఓటమి ఖాయం. అందుకే ఆయన ఇష్టం లేకపోయినా కోట్ల చేరికను ఒప్పుకున్నారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిది కూడా ఇదే పరిస్తితి. తాను కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు జగన్ పార్టీలో ఖాళీ లేకపోవడం, అనుకున్న విధంగా చంద్రబాబు రియాక్ట్ అవ్వడంతో కోట్ల టీడీపీలో చేరారు. నేతలు కాంప్రమైజ్ కావడంతో కార్యకర్తలు కూడా ప్రస్తుతానికి చేతులు కలిపారు. కానీ ఎన్నికల వేళ ఈ సంధి ప్రయత్నం, అవసరార్థపు స్నేహం కల్సొస్తుందా అంటే… ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్తితి. కచ్చితంగా ఎక్కడో అక్కడ అనుమాన బీజం పెరిగి పెద్దది అవుతుంది. ఎందుకంటే నేతలు సర్దుకున్నా… ఫ్యాక్షన్ బారిన పడ్డ కుటుంబాలు సర్దుకు పోతారన్న గ్యారెంటీ లేదు. ఇదే ఇప్పుడు జగన్ పార్టీకి కర్నూలు జిల్లాలో కల్సొచ్చే అంశంగా మారనుంది.