ఎండలో తిరిగి తిరిగి టాన్ అవుతున్నారా ? ఈ ఫేస్ ప్యాక్స్ తో మెరిసిపోండి

summer face packs

అబ్బా.. బయటికెళ్లాలంటేనే భయమేస్తోంది కదా ! ఎర్రగా మండే సూర్యుడు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. భగభగ మండే ఎండలకు తోడయ్యాయి వడగాలులు. ఇలాంటి ఎండలో.. వడగాల్పుల్లో తప్పనిసరై బయటికి వెళ్లే వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎర్రటి ఎండలో తిరిగేవారి చర్మం, ముఖం టాన్ అవుతుంటుంది. అంటే నల్లబడుతుంటుంది. మరికొందరి చర్మం అయితే వడలిపోతుంది. అలాంటి వారి కోసమే ఈ ఫేస్ ప్యాక్స్. ఓ సారి ట్రై చేసి చూడండి.. మార్పు మీకే తెలుస్తుంది. 

1. రెండు చెంచాల శనగపిండిలో.. అరకప్పు పాలు లేదా పెరుగు, అరచెక్క నిమ్మరసం, కొద్దిగా పసుపు వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన పేస్టు డ్రై అయ్యాక చల్లటి నీటితో కడుక్కోవాలి (ఆ సమయంలో సబ్బు వాడరాదు, వెంటనే స్నానం చేయకూడదు). ఇలా రోజూ చేస్తే.. ముఖంతో పాటు చర్మంకూడా మంచి రంగులో ఉంటుంది. 

2. రెండు చెంచాల మంచి గంధం పొడిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం మంచిరంగులోకి రావడంతో పాటు.. మంచి సువాసన కూడా వస్తుంది. చెమట కూడా ఎక్కువగా పట్టదు. 

3. స్నానం చేసేటపుడు చాలా మందికి నలుగు పెట్టుకోవడం అలవాటు. ఆ నలుగు.. శనగపిండితో కాకుండా.. పచ్చిపసుపుతో పెట్టుకుంటే చర్మానికి చాలా మంచిది. టాన్ తొలగిపోవడంతో పాటు.. చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది. మెడచుట్టూ పేరుకునే నలుపు కూడా తగ్గుతుంది. 

4. టమోటా ఫేస్ ప్యాక్ - రెండు ఎర్రటి టమోటాలను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో అరచెంచా రోజ్ వాటర్ కలుపుకుని.. టాన్ ఎక్కువగా ఉన్నచోట అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. 

5. రోజూ రాత్రి పడుకునే ముందు ముఖం, మెడ శుభ్రంగా కడుక్కొని.. కాటన్ బాల్ తో రోజ్ వాటర్ ను రాసుకోవాలి. ఆరిన తర్వాత కడగకుండా.. అలాగే పడుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. ముఖం ఎంతో నీటుగా కనిపిస్తుంది. 

6. బీట్ రూట్ ఫేస్ ప్యాక్ - ఒక బీట్ రూట్ చెక్కు తీసి.. ఒక మాదిరిగా ముక్కలు చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి (నీళ్లు వేయకుండా) మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. రంగు తక్కువగా ఉన్నవారికి కూడా మంచి ఫలితాలొస్తాయి. అలాగే బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు.. మంచి రక్తప్రసరణ కూడా ఉంటుంది.