నేడు పీఎస్‌ఎల్వీసీ-సి50 రాకెట్‌‌కు కౌంట్‌డౌన్..తిరుమల శ్రీవారిని దర్శించిన ఇస్రో శాస్త్రవేత్తలు..!

pslv c50

ఇస్రో ఈ ఏడాది మరో రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ వేదికలో ఈ రోజు మధ్యాహ్నం 2:41 గంటలకు పీఎస్‌ఎల్వీ -సీ50 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌  మొదలుకానుంది. దాదాపు 25 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత అంటే  రేపు మధ్యాహ్నం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక నింగిలోకీ నిప్పులు విరజిమ్ముతూ దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా  ఇస్రో శాస్త్రవేత్తలు 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ సీఎంఎస్‌-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.  

కాగా పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్‌‌లో ఇది 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని ఇస్రో వెల్లడించింది.  భార‌త‌దేశ‌పు 42వ క‌మ్యూనికేష‌న్ ఉప్రగ‌హం.. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవ‌ల‌ను అందించేందుకు దీనిని నిర్దేశించారు. దీని ప‌రిమితి భార‌త్‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్‌ల‌కు విస్తరిస్తుంది.

ఇదిలా ఉంటే ఇవాళ  తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి చెంత పీఎస్ఎల్వీ సీ 50 నమూనా రాకెట్ కు పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అర్చకులు ఆశీర్వచనం చేశారు. రేపు నింగిలోకి దూసుకువెళ్లనున్న పీఎస్ఎల్వీ - సీ50 రాకెట్‌ ప్రయోగం కోసం దేశప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇస్రో చరిత్రలో మరో విజయం లిఖించబడుతుంది.