నీరవ్ మోదీని అప్పగించేందుకు యూకే లైన్ క్లియ‌ర్‌

నీరవ్ మోదీని అప్పగించేందుకు యూకే లైన్ క్లియ‌ర్‌

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్ర‌ధాని నిందితుడు, డైమండ్ వ్యాపారి నీర‌వ్ మోదీని ఇండియాకు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను బ్రిటన్ హోంమంత్రి ప్రీతి ప‌టేల్  భార‌త ప్ర‌భుత్వానికి పంపిన‌ట్టు తెలుస్తుంది. భార‌త్‌కు అప్ప‌గింత‌ను స‌వాల్ చేస్తూ నీర‌వ్ కొద్ది రోజుల క్రితమే  లండన్ కోర్టులో పిటిష‌న్ దాఖాలు చేశారు. కానీ లండ‌న్ కోర్టులో చుక్కెదురైంది.  భార‌త్ లో స‌రైన ద‌ర్యాప్తు జ‌ర‌గ‌ద‌న్న‌ నీర‌వ్ వాద‌న‌ను త‌న 83 పేజీల ఉత్త‌ర్వుల్లో బ్రిట‌న్ వెస్ట్ మినిస్ట‌ర్ మేజిస్ట్రేట్స్ కోర్ట్ తోసిపుచ్చింది.    
 
 ఈ క్రమంలో మ‌రోవైపు క‌రోనా మ‌హ‌మ్మారితో నీర‌వ్ మోదీ మాన‌సిక ఆరోగ్యం బాగాలేద‌ని, అలాగే భార‌త్ లో మాన‌వ హ‌క్క‌ల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌నే  కార‌ణం చెప్పి త‌ప్పించుకోవడానికి నీరవ్ మోదీ ప్ర‌య‌త్నించారు. కానీ, అత‌ని త‌ర‌పు అడ్వ‌కేట్ల వాద‌న‌నూ కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఇక నీర‌వ్ కు ఆర్ధ‌ర్ రోడ్డు జైలులో బ్యార‌క్ నెంబ‌ర్ 12లో అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని భార‌త్ హామీ ఇచ్చింద‌ని జ‌డ్జ్ గూజీ ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీంతో నీర‌వ్ మోదీని భార‌త్ కు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ హోంమంత్రి ప్రీతి ప‌టేల్ ఆమోదముద్ర వేశార‌ని సీబీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
 
 సుమారు రూ.14 కోట్ల విలువైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నీరవ్ మోదీ ప్ర‌ధాన‌ నిందితుడు. నీరవ్ మోదీ మీద భారత్‌లో రెండు రకాలైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ కేసు కొనసాగుతోంది. అందులో ఒప్పంద పత్రాలు, లోన్ అగ్రిమెంట్లకు సంబంధించిన విచారణ జరుగుతోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది.