10 పేజిల లేఖ..ఏడాదిలో 9 సెల్‌ఫోన్లు మార్చిన శ్రీనివాస్

0
211
srinivas attacks on ys jagan

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడి కేసును విశాఖ పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడికి కారణాలను ఆరా తీశారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిందితుడిని విచారించారు. ప్రధానంగా 10 పేజీల లేఖపై పూర్తి దర్యాప్తు కొనసాగించారు. స్వాధీనం చేసుకున్న లేఖలోని తొమ్మిది పేజీలను నిందితుడి బంధువు విజయలక్ష్మీతో రాయించగా.. ఒక పేజీని సహచర ఉద్యోగి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలికి చెందిన రేవతిపతితో రాయించినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుడు ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చినట్టు గుర్తించారు. ఒకే సిమ్‌ను వాడుతూ ఆ సెల్‌ఫోన్లు ఎందుకు మార్చాడనే దానిపై విచారణ జరుపుతున్నట్టు సీపీ మీడియాకు వెల్లడించారు. నిందితుడి నుంచి మరో చిన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడు గత నాలుగు నెలలుగా విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. దాడికి వాడిన కత్తి కోడిపందేలుకు వాడిందని, ఆ కత్తి పొడవు 8సెం.మీలు ఉండగా.. కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని వివరించారు. నిందితుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనే విషయాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.