జగన్‌పై దాడి ఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ : వైవీ సుబ్బారెడ్డి

0
213
Yv subbareddy Fires on Chandrababu Naidu

ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జగన్‌పై దాడి జరిగిందా అని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు టీడీపీకి చెందిన వ్యక్తి క్యాంటిన్‌లో పనిచేస్తున్నాడని, శ్రీనివాసరావును వైసీపీ అభిమానిగా చిత్రీకరించడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. 11 నెలల క్రితం పెట్టిన ఫ్లెక్సీని ఇప్పుడు తెరపైకి తెచ్చారని, ఆరు నెలలుగా టీడీపీలో ఉన్నామని శ్రీనివాసరావు సోదరుడు చెప్పాడని ఆయన తెలిపారు. శ్రీనివాసరావు వద్ద ఉన్న లెటర్‌ రాత్రి 10 గంటలకు విడుదల చేయడమేంటని, ఫ్లెక్సీ మాదిరిగానే లెటర్‌ కూడా టీడీపీ వాళ్లే సృష్టించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలల్లో శ్రీనివాసరావు కుటుంబానికి రెండు లోన్లు ఇచ్చారని చెప్పారు. ఆపరేషన్‌ గరుడ స్క్రీన్‌ ప్లే డైరెక్షన్‌ చంద్రబాబుదేనని, ఆపరేషన్‌ గరుడపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు స్పందించిన తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నారని, అలిపిరి ఘటన జరిగినప్పుడు వైఎస్ ఎలా స్పందించారో అందరికీ తెలుసని వైవీ చెప్పారు. ఇప్పుడు జగన్‌పై దాడి జరిగితే చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, జగన్‌ మెరుగైన వైద్యం, భద్రత కోసమే విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చారని వైవీ తెలిపారు. జగన్‌పై దాడి ఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ అని వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. థర్డ్‌ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్‌ వేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.