ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య మాటల్లేవ్.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల త్వరలో స్వీకరిస్తారంటూ మీడియా కోడై కూస్తోంది. అయితే కేవలం మూడు నెలల్లో ఏపీ ఎలక్షన్ జరగబోతోంది. నిజంగానే షర్మిల ఏపీ బాధ్యతలు స్వీకరిస్తే… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాసుగా బాధితులు తీసుకోకుండా షర్మిలను జగన్ ఆపగలిగితే.. ఏపీలో జగన్ మరోసారి గెలిచేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే అందుకు జగన్ కు అవకాశం కూడా కలిసి రానుంది. అదే షర్మిల తనయుడి నిశ్చితార్థం.
తన చెల్లితో సఖ్యత కుదుర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి అవకాశం లభించింది. దీన్ని ఎలా వాడుకుంటారనేది జగన్ ఆలోచనపై ఆధారపడింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకు జగన్, కూతురు షర్మిల మధ్య విభేదాల గురించి అందరికీ తెలిసినవే. వాళ్లిద్దరి మధ్య ఇక కలుసుకోలేనంతగా విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఇంత వరకూ జగన్ గురించి ఎక్కడా కొద్దిపాటి వ్యతిరేకమైన వ్యాఖ్యలు కూడా షర్మిల చేయలేదు. అయితే షర్మిలతో సయోధ్య కుదుర్చుకోవడమే జగన్ కు రాజకీయంగా మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్నాచెల్లెళ్లు మునుపటిలా కలుసుకునే మంచి అవకాశం దక్కింది.
షర్మిల కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో ఈ నెల 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఈ విషయాన్ని సోమవారం ట్విటర్ వేదికగా షర్మిల ప్రకటించారు. వివాహ తొలి ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద ఉంచేందుకు వధూవరులతో కలిసి కుటంబ సభ్యులంతా వెళ్లనున్నట్టు సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు.
షర్మిల ఇంట్లో జరిగే శుభకార్యం వైఎస్ బిడ్డల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఇది ఎంత వరకు సాధ్యమనేది ఇటు జగన్, అటు షర్మిల ఆలోచనలను బట్టి వుంటుంది. షర్మిల ఇంట్లో జరిగే శుభకార్యానికి కేవలం నామమాత్రంగా హాజరై జగన్ పరిమితం అవుతారా? అంతకు మించి ఇన్వాల్వ్ అవుతారా? అనే దానిపై ఇరువురి మధ్య సయోధ్య ఆధారపడి వుంటుందనే చర్చ నడుస్తోంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి, ఇక్కడ కూడా అంతే మరి!