జనసేనాని పవన్ కల్యాణ్ అధికార పక్షంపై తల తోక లేని ఆరోపణలు చేసి మరోసారి అభాసు పాలయ్యారు.
ఏమీ మాట్లాడకపోతేనే ఆయనకు గౌరవం… నోరు తెరిస్తే ఆయన అజ్ఞాన డొల్లతనం బయటపడుతోంది. దీంతో పవన్ కల్యాణ్ నవ్వుల పాలవుతున్నారు.
వైసీపీ నేతల గురించి ఎవరైనా ఏదైనా చెబితే, నిజానిజాలతో సంబంధం లేకుండా విమర్శలు చేయడం ఆయనకు అలవాటైంది. కనీసం సమాజం నవ్విపోతుందే అనే వెరపు కూడా ఆయనలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చంద్రబాబునాయుడితో కలిసి ఇవాళ సీఈసీ రాజీవ్ కుమార్ ను పవన్ కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు, ఇతరత్రా అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. కేవలం చంద్రగిరి నియోజకవర్గంలోనే లక్ష పైచిలుకు దొంగ ఓట్లు నమోదు అయ్యాయని ఆయన సంచలన ఆరోపణ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
నమోదైన లక్ష పైచిలుకు దొంగ ఓట్లలో కొన్ని ఆమోదం కూడా పొందాయన్నారు. పవన్ కల్యాణ్ ఆరోపణలను కాసేపు పక్కన పెడదాం. వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో 3,00,900 మంది ఓటు హక్కు కలిగి వున్నారు. ఈ నెల 22వ తేదీ వరకూ ఓట్ల మార్పుచేర్పులకు అవకాశం వుంది. 2019 ఎన్నికల నాటి పరిస్థితి తెలుసుకుంటే, పవన్ ఆరోపణల్లోని డొల్లతనం బయట పడుతుంది.
2019 ఎన్నికల నాటికి చంద్రగిరి ఓటర్ల సంఖ్య 2,92,162 మంది. ఓటు హక్కు వినియోగించుకున్నది 2,28, 192 మంది టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 41,755 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019కి, ఇప్పటికి చంద్రగిరిలో పెరిగిన ఓటర్లు 8,738 మాత్రమే. ఇక పవన్ కల్యాణ్ లక్ష ఓట్ల దొంగ ఓట్ల లెక్కేంటో ఆయనే చెప్పాలి.
గతంలో విచ్చలవిడిగా చంద్రగిరిలో టీడీపీ దొంగ ఓట్లు చేర్చగా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఢిల్లీ వరకూ వెళ్లి పోరాడి, వాటిని తొలగింపజేశారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల గురించి పక్కాగా సమాచారం వుంటే, టీడీపీ, జనసేన నేతలు కూడా అదే పని చేయొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఏపీ రాజకీయ పార్టీల నేతలు చుట్టాలు కాదు. కేవలం దొంగ ఓట్ల పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, నెగెటివిటీని సృష్టించే వ్యూహంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.