సీఎం పదవిపై నారా లోకేశ్ చేసిన కామెంట్స్ పై ఇప్పటికీ రాజకీయంగా చర్చ జరుగుతూనే వుంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనేది మెజార్టీ కాపులు ఆశ. ఇంత వరకూ కాపులెవరూ సీఎం పదవిని చేపట్టలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపుల ఓట్లు గణనీయంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారాన్ని దక్కించుకోలేక పోతున్నామన్న ఆవేదన వారిలో వుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఆ సామాజిక వర్గానికి పవస కల్యాణ్ ఒక ఆశా కిరణంగా కనిపించారు.
టీడీపీతో జనసేన పొత్తులో భాగంగా అధికారంలో భాగమిస్తారని కాపు సామాజిక వర్గం భావించింది. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లారు నారా లోకేశ్. టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా పని చేస్తారని ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అలాగే కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా లోకేశ్ హామీ ఇవ్వలేదు. అవన్నీ చంద్రబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో, పవన్ కల్యాణ్ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ పై కాపులు ఆగ్రహంగా వున్నారు. ఇదే సందర్భంలో లోకేశ్ అంత బలంగా చెప్పడాన్ని టీడీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. భవిష్యత్లో తమను చంద్రబాబు, టీడీపీ మోసం చేశాయనే నింద రాకూడదనే ముందు. చూపుతో లోకేశ్ వ్యూహాత్మకంగా సీఎం పదవిపై తేల్చి చెప్పారనే మాట వినిపిస్తోంది. అసలే చంద్రబాబుకు వెన్నుపోటుదారుడనే చెడ్డ పేరు ఉన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మరోసారి అలాంటి చెడ్డపేరు పవన్ విషయంలో రాకూడదనే లోకేశ్ ముందు జాగ్రత్తలో భాగంగా తేల్చి చెప్పారని వివరించడం గమనార్హం. కొన్ని విషయాల్లో లోకేశ్ నిర్మొహమాటంగా వుంటారనేందుకు ఇదే నిదర్శనంగా టీడీపీ నేతలు చెబుతున్నారు.