కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజకీయంగా పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృపారాణి రాజ్యసభ సీటు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ఆవిరవడంతో… తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సార్లూ వైసీపీ ఎంతో మందిని రాజ్యసభకు పంపించింది. ఆ లెక్క చూసుకుంటే పదకొండు మందికి అని చెప్పాలి.
రెండేసి సార్లు వంతున ఎనిమిది మంది వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తే ఈ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో ముగ్గురు ఆ పార్టీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఉత్తరాంధ్రాకు చాన్స్ దక్కింది. కానీ దాన్ని పాయకరావుపేట సీనియర్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కేటాయించారు.
దాంతో ఉత్తరాంధ్రా కోటా పూర్తి అయింది అని అంటున్నారు. బీసీల నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఓసీ నుంచి వైవీ సుబ్బారెడ్డికి చాన్స్ దక్కనుంది అని అంటున్నారు.
దీంతో కిల్లి కృపారాణికి ఈసారి కూడా చాన్స్ లేనట్లే అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎంపీగా పోటీ చేయిస్తారా లేక ఎమ్మెల్యేగానా అన్నది మాత్రం చూడాలని అంటున్నారు. ఆమె టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే హై కమాండ్ ఆలోచనలలో ఆమెను శ్రీకాకుళం నుంచి ఎంపీగా నిలబెట్టాలని ఉందని అంటున్నారు.
అయితే ఎంపీ రేసులో కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. దాంతో కిల్లికి ఎక్కడ టికెట్ ఇస్తారు అన్నది కూడా తెలియడంలేదని అంటున్నారు. వైఎస్సార్ హయాంలో ఎంపీగా గెలిచి ఆపై కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన కృపారాణి రాజకీయ భవితవ్యం ఎటూ తేలక అనుచర వర్గంలో అయితే కలవరం రేగుతోంది. అయితే బీసీ మహిళగా ఉన్నత విద్యవంతురాలిగా ఉన్న కృపారాణి సేవలను వైసీపీ సరిగ్గానే వాడుకుంటుంది అని అంటున్నారు.
మరి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేసి చూడాలి.