ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో రాజకీయాలు మరింత హీట్ పెట్టిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల భర్త అనిల్‌ను టీడీపీ నేత బీటెక్ రవి కలవడం చన్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా దిగిన ఫోటో వైరల్ అయ్యింది. మరోవైపు జగన్ గురించి బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. షర్మిలను, తనను దూరం పెడుతూ వచ్చారని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
ఇక ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదని.. విధిలేని పరిస్థితులు కల్పించడంతో ఇలా రావాల్సి వచ్చిందని అనిల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
బుధవారం కడప విమానాశ్రయంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన ఎదురుచూస్తుండగా.. టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు బీటెక్ రవి, దేవగుడి నారాయణరెడ్డి కూడా విజయవాడ వెళ్లేందుకు వచ్చారు. వీరంతా లాంజ్‌లో అనుకోకుండా కలిశారు. రవి, నారాయణరెడ్డి.. అనిల్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు సమాచారం.
అనంరతం వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలిసింది. మీ డిబేట్లు చూస్తుంటానని.. ముక్కుసూటిగా మాట్లాడతారని బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ అన్నారట.
ఇక షర్మిలతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరతానని అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తున్నారా అని అడుగగా… అది రాహుల్ గాంధీ ఇష్టమని.. పీసీసీ ఇస్తారా.. సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఇస్తారా అనేది తమ మధ్య చర్చకు రాలేదని చెప్పినట్లు సమాచారం.
ఇక కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే అని అనిల్ బదులిచ్చారట. షర్మిలకు పీసీసీ ఇస్తే కడప జిల్లాలో వైసీపీపై ప్రభావం, కాంగ్రెస్ లో చేరికల గురించి చర్చ జరిగినట్లు తెలిసింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఎక్కడ ఉన్నా.. జిల్లా రాజకీయాలను దివంగత వివేకానందరెడ్డే చూసేవారని, ఆయన్ను అంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని అనిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఆ హత్య కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేశారని, ఇబ్బందులకు గురిచేశారని బీటెక్ రవి, నారాయణరెడ్డి తెలిపారు. మొత్తానికి బ్రదర్ అనీల్ వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి.