నియోజకవర్గంలో పట్టుకోల్పోతే. నాయకులెవరూ ఓర్చుకోలేరు. అందుకే సీటు కోసం ఏ పార్టీ అయినా ఫర్వాలేదని నాయకులు అలవోకగా పార్టీలు మారుతుంటారు. అంత వరకూ తిట్టిన నాయకుల చేతుల మీదుగా కండువా కప్పుకోవడం చూస్తున్నాం. కానీ ఏపీలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మనసు నొచ్చుకుంది. దీంతో ఎన్నికలు, రాజకీయాలకే దూరంగా వుండాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని అనుకుంటున్నారు. అన్నా రాంబాబు ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. మైలవరం ఎమ్మెల్యే మాత్రం చిక్కడు, దొరకడు అన్న రీతిలో సీఎంవోకు దూరంగా వుంటున్నారు. జగన్ ను కలిసేందుకు రావాలని సీఎంవో నుంచి పలుమార్లు వసంత కృష్ణప్రసాద్కు ఫోన్ కాల్ వెళ్లింది.
వసంత కృష్ణప్రసాద్ మాత్రం సీఎంవోకు వెళ్లి సీఎం జగన్ మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని, తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న సమాచారాన్ని చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇవాళ సీఎంతో భేటీ అయ్యేందుకు వసంత కృష్ణప్రసాద్ సీఎంవోకు వెళుతున్నారని సమాచారం.
సొంత పార్టీకి చెందిన నేతలతోనే అన్నా రాంబాబు, వసంత కృష్ణప్రసాద్ సమస్యలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మంత్రి జోగి రమేశ్ తరచూ మైలవరం నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని, ఆయన్ను నిరోధించాలని పలుమార్లు సీఎం మొదలుకుని పార్టీ పెద్దలకు వసంత మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన అసహనానికి లోనయ్యారు.
రాజకీయాలకే దూరంగా వుండేందుకు నిర్ణయించుకుని, సీఎంను కలిసేందుకు నిరాకరిస్తున్నారని అంటున్నారు. అయితే పోటీ చేయనని చెప్పడానికే సీఎం వద్దకు వెళుతున్నారా? లేక నిర్ణయంపై పునరాలోచించి, తిరిగి తలపడేందుకు రెడీ అయ్యారా? అనేది తేలాల్సి వుంది.
అన్నా రాంబాబు విషయానికి వస్తే మరోసారి ఇవాళ కూడా పోటీ చేయనని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు. అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా వుండాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కానీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా జిల్లా అంతా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన హెచ్చరించారు.
ఇదే సందర్భంలో తాను పార్టీ మారనని, వైసీపీలోనే వుంటానని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీలోనే వుంటూ, ఎన్నికలకు దూరమని ప్రకటించడం ద్వారా నష్టపోయేదెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈ ఇద్దరు నేతలు రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలి!.