టిడిపి నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ ఫైర్ అయ్యారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రాధాన్యాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించామని.. కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా త్వరలోనే చేపడతామని చెప్పారు. అయితే, ప్రభుత్వ అధికారులపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం సరికాదని హితవు పలికారు. పొదలకూరులో మైనింగ్ చేస్తున్న వారి నుంచి టన్నుకు రెండు వేల రూపాయలు ఆయన డిమాండ్ చేశారని ఆరోపించారు. అది ఇవ్వనందుకే నానా హడావిడి చేస్తున్నారు.. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ లో తన పాత్ర ఉందని సోమిరెడ్డి ఆరోపించారు.. మరి ఇప్పుడెందుకు ఆ మండలం గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి.. ముత్తుకూరు మండలంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థ యాష్ పాండ్ నిర్మిస్తుంటే హడావిడి చేశారన్న ఆయన.. వాళ్ల నుంచి మామూళ్లు తీసుకున్నారని ఆరోపించారు. ఒక సబ్జెక్ట్ తీసుకుని అందులో తన వాటా వచ్చిన తర్వాత మరో సబ్జెక్టు లోకి వెళ్లడం సోమిరెడ్డికి అలవాటే అని విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.