టీడీపీలో అభ్యర్థుల ఎంపిక పెద్ద ప్రహసనమే. టీడీపీలో అభ్యర్ధుల ఎంపిక కేవలం చంద్రబాబు చేతల్లోనే లేదు. ఎల్లో మీడియాధిపతులు, పార్టీ సీనియర్ నేతలు, ఇప్పుడు నారా లోకేశ్… వీళ్లందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకోగలరు. అందుకే టీడీపీ అభ్యర్ధుల ప్రకటన ఎప్పుడూ ఆలస్యమే. చంద్రబాబుకు అనుమానం ఎక్కువ. ఫలానా అభ్యర్థిని ఎంపిక చేస్తే ఏమవుతుందో అనే భయం ఆయనలో వుంటుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ సీటుకు డిమాండ్ పెరిగింది. గతంలో నాయకుల వెనుక ప్రజాదరణ చూసే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రజల్లో బలం కంటే, అభ్యర్థుల ఆర్థిక స్తోమతే అర్హతగా మారింది. దీంతో టికెట్ కావాలని కోరుకుంటున్న నాయకులను ఏ మేరకు ఖర్చు పెట్టుకోగలవని టీడీపీ పెద్దలు ప్రశ్నిస్తున్నారని సమాచారం.
ఈ దఫా అధికార పార్టీ డబ్బు వెదజల్లుతుందని, వారిని తట్టుకోవాలంటే మనం కూడా ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలని, అందుకు సిద్ధమైనా? అని తమను ప్రశ్నించినట్టు కొందరు ఆశావహులు చెప్పడం విశేషం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 40 నుంచి 50 కోట్ల ఎన్నికల ఖర్చు అవుతుందని, ఆ మేరకు వైసీపీ రెడీ చేసుకుందని టీడీపీ నేతలు అంటున్నారు.
కేవలం ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకుని, ఆర్ధిక వనరుల్ని విస్మరిస్తే అసలుకే ఎసరు వస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారు. కావున బాగా డబ్బున్న నేతలను రంగంలోకి దింపి, వైసీపీని దీటుగా ఎదుర్కోడానికి బడా బాబుల కోసం టీడీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో గుడివాడలో కొడాలి నానిపై ఎస్ఆర్బని బరిలో దింపిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం పని చేశారనే మాటల్ని టీడీపీ పట్టించుకోవడం లేదు. డబ్బు లేనిదే ఏమీ చేయలేమని, అలాంటి నాయకులకే మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు.
పార్టీ పరంగా రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఇస్తామని ఆశావహులతో టీడీపీ నేతలు అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పెట్టే ఖర్చకు ఏ మాత్రం తగ్గకుండా మిగిలిన మొత్తాన్ని భరించుకోవాలని తేల్చి చెబుతున్నారు. కేవలం ఆర్ధికపరమైన కారణాలతోనే ప్రజాదరణ నాయకుల కంటే ధనవంతులకే కొన్ని చోట్ల చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.