టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్ళనున్నారా? గెలుపే పరమావధిగా టీడీపీ భావిస్తుందా? అని అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కనివిని ఎరగని రీతిని తలపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ పార్టీలకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్టుగా పరిణమించాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో ఆయన భార్య నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ, చంద్రబాబును వైసీపీ కుట్ర పూరితంగా అరెస్టు చేయించిందనీ, చంద్రబాబు ఏ తప్పూ చెయ్యలేదనీ, ఆయన నిర్దోషిగా తిరిగొస్తారని ప్రచారం సాగించారు.
నిజం గెలవాలి అనే నినాదంతో నిజాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఐతే.. చంద్రబాబు బెయిల్పై బయటకు రావడంతో… ఆమె తన పర్యటనకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల తన కుమారుడు నారా లోకేష్.. యువగళం పాదయాత్రను విజయవంతంగా ముగించడంతో.. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు స్తబ్దుగా ఉన్నాయి. చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఐతే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ మరో 100 రోజులు కూడా లేవనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. నారా భువనేశ్వరి.. రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు నిజం గెలవాలి నినాదంతో మళ్ళీ పర్యటనలు చెయ్యబోతున్నారు.
ఇదివరకు నారా భువనేశ్వరి ఎప్పుడూ ఏ ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ఆమె ఎప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. వైఎస్ జగన్ అరెస్టు సమయంలో… ఆయన చెల్లి షర్మిల ఓదార్పు యాత్ర కొనసాగించిన తరహాలోనే.. భువనేశ్వరి కూడా నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొన్ని రోజులు కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆమె దాన్ని కంటిన్యూ చెయ్యాల్సిన అవసరం లేదన్నది రాజకీయ వర్గాల భావన. కానీ భువనేశ్వరి.. తన పర్యటనను కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. చూడాలి మరి ఎన్నికల సమీపించిన వేళ! రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో!