సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కానున్నారా? స్వయంగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ అంతా తిరగనున్నారా అనంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో సీఎం కేసీఆర్, ప్రజలకు అందుబాటులో ఉండరు అనే విమర్శ కూడా ఒకటిగా చెబుతున్నారు. దీన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. జగన్ అధికారంలోకి రావడానికీ, వైసీపీకి 151 సీట్లు రావడానికి ప్రధాన కారణం 2019కి ముందు ఆయన చేసిన ఓదార్పు యాత్రే. ఆ యాత్రతో ప్రతిపక్ష నేతగా జగన్ నిరంతరం ప్రజల్లో ఉన్నారు. అప్పుడప్పుడూ నిరాహర దీక్షలూ చేశారు. దాంతో ప్రజలు ఆయన్ని తమ నేతగా భావించి, భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 175 కి 175 సీట్లు రావాలని అంటున్న జగన్.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్లబోతున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీల అధినేతలైన బాబు,పవన్ లలో గుబులు మొదలైందట. ఒక్కసారిగా డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది.
సీఎం జగన్ బస్సులో వెళ్తారా, మరేదైనా మార్గంలో వెళ్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం. దీనిపై 10 రోజుల్లో క్లారిటీ వస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ వచ్చేలోపై కొన్ని కీలక పథకాల్ని అమలుచేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తూనే జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 21 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చనే అంచనాతో, అప్పటికల్లా టూర్‌కి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారని సమాచారం. సీఎం జగన్ ప్రజల్లోకి వెళితే మాత్రం ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయం అంటున్నారు.