ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలలు సమయం ఉండగానే నేతలు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆపార్టీకి గుడ్ బై చెప్పారు.
తనకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన టీడీపీలోనే తిరిగి మళ్లీ చేరబోతున్నారు. గతంలో టీడీపీలో అనేక పదవులు చేపట్టిన దాడి వీరభద్రరావు 2013లో టీడీపీ నుంచి బయటకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. నాడు వైసీపీలో చేరడానికి తన ఇద్దరు కొడుకులు రత్నాకర్, జైవీర్ కారణంగానే వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ఆశించినప్పటికి వైసీపీ ఆ సీటును గుడివాడ అమర్ నాథ్ కి ఇచ్చి మంత్రిని కూడా చేసింది. అయితే గడిచిన ఐదేళ్లలో పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం, సరైన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకొని వైసీపీకి తనతో పాటు కుటుంబ సభ్యులైన ఇద్దరు కొడుకు రాజీనామా చేశారు.
టీడీపీలో చేరే అంశంపై బుధవారం చంద్రబాబు, లోకేష్ తో చర్చించి ఎప్పుడు చేరేది ప్రకటించనున్నారు.
వైసీపీలో చాలామంది అసంతృప్తి నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . ఎన్నికల సమయం వరకు వేచి చూసే కంటే ఇప్పుడే పార్టీ మారితే కనీసం రాజకీయ భవిష్యత్తు అయినా ఉంటుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సిట్టింగ్ లకే ఈసారి పోటీ చేసే ఛాన్సు లేకపోవడంతో ఎలాంటి పదవులు లేకుండా ఉన్నవాళ్లు వేరే పార్టీలో చేరడం మంచిదని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ నేత దాడి వీరభద్రరావు పార్టీ మారుతున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తూ సీఎం జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జలకు రాజీనామా లేఖలను పంపారు.
సొంత గూటికే ..!
వైసీపీని వీడాలనుకోవడం వెనుక దాడి వీరభద్రరావు ఫ్యామిలీ అంతా ముందుగా చర్చించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దాడి ఫ్యామిలీలో వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు రత్నాకర్, జైవీర్ కూడా రాజీనామా లేఖలు పంపారు. టీడీపీలో చేరేందుకు చంద్రబాబునాయుడిని నేడు కలిసి చర్చిస్తారు. దాడి వీరభద్రరావుకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో బుధవారం దాడి వీరభద్రరావు ఆయన కుమారులు, కార్యకర్తలు కలిసి చర్చించనున్నారు. గతంలో టీడీపీ నేతగా కొనసాగిన దాడి వీరభద్రరావుకు తిరిగి అదే పార్టీలో చేరడం ఆయన వర్గానికే కాకుండా పార్టీకి కూడా కలిసొచ్చే అంశంగా చూడాలి
గత ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అయితే అనకాపల్లి టికెట్ ఆశించినప్పటికి జగన్ ఆ కోరిక తీర్చలేదు. దాంతో వైసీపీలోనే ఎలాంటి పదవులు, గుర్తింపు లేకుండా కొనసాగారు. ఇప్పుడు తమ రాజకీయ ఎదుగుదలకు టీడీపీ అయితేనే బెటర్ అని భావించినట్లుగా తెలుస్తోంది. దాడి వీరభద్రరావుతో పాటు కుమారులు రత్నాకర్, జైవీర్ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. ఈరోజు చంద్రబాబు, లోకేశ్ ను కలిసి చర్చిస్తామని అప్పుడే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ తెలిపారు.