సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు.. తన అన్నకు సపోర్ట్ గా నిలిచి, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. కేడర్లో ధైర్యాన్ని నింపి పాదయాత్ర చేశారు షర్మిల. అయితే ఈ మధ్యకాలంలో జగన్ రాజకీయ ప్రత్యర్థులతో సఖ్యతగా మెలుగుతున్న వైనం.. అన్నా, చెల్లెల మధ్య మరింత అగాధాన్ని పెంచిందని చెప్పొచ్చు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్ధం ఈ నెల 18న, వివాహం వచ్చే నెల 17న జరగనున్నాయి. ఈ వేడుకలకు రావాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను రాజకీయాలకు అతీతంగా ఆమె ఆహ్వానిస్తున్నారు.
మొదట తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆహ్వాన పత్రిక ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికెళ్లి నిశ్చితార్ధ, వివాహ వేడుకలకు రావాలని ఆహ్వానించారు.
అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులను వరుసగా ఆహ్వానించుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఇంటికి 11 గంటలకు ఆమె వెళ్లనున్నారు. తన కుమారుడి వేడుకకు రావాలని బాబు కుటుంబ సభ్యుల్ని ఆమె ఆహ్వానించనున్నారు.
ఈ పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. చర్చనీయాంశమైంది. సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరస్పరం రాజకీయ ప్రత్యర్థులన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకరికొకరు రాజకీయంగా బద్ద శత్రువులు. మరోవైపు అన్నతో వ్యక్తిగత విభేదాలతో షర్మిల రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకున్నారు. తెలంగాణాలో సొంత పార్టీని పెట్టుకున్నప్పటికీ, ఆదరణ లేకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది.
ఇప్పుడామె ఏపీ కాంగ్రెస్ లీడర్. త్వరలో ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను స్వీకరించనున్నారు. అన్నపై బాణాలు సంధించనున్నారు. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని లోకేశ్ కు ప్రత్యేకంగా గిఫ్ట్ లు కూడా షర్మిల పంపారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఇంటికెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుభకార్యాలకు ఆహ్వానించడానికే అయినప్పటికీ.. జగన్, వైసీపీ నేతలు ఎలా చూస్తారనే విషయమై చర్చ జరుగుతోంది. ఇంకా ముందు రోజుల్లో షర్మిల నిర్ణయాలు ఎలా ఉండబోతాయన్నది సర్వత్ర చర్చనీయాంశమౌతోంది.