వై ఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యాక..ఆయన అనేక సంక్షేమ పధకాలు అమలు చేసి ఉన్నారు. వాటినే ఆయన నమ్ముకున్నారు. వచ్చే ఎన్నికల్లో అవే వైసీపీని గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల ముందు బ్రహ్మాస్త్రంగా ఆరోగ్యశ్రీ పధకం స్మార్ట్ కార్డులను వదిలారు. పాతిక లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స ఉచితంగా చేయించుకునే స్మార్ట్ కార్డులను జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేసే రోగాలను వేయికి పైగా పెంచారు. ఇలా రోగాల సంఖ్య పెంచడం వైద్య ఖర్చుల పరిమితిని పాతిక లక్షలకు చేయడం ద్వారా పేదింటికి ఆరోగ్యాన్ని జగన్ తీసుకుని వచ్చారు.
ఈ పరిణామం పట్ల పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఎంతో సంతోషిస్తున్నాయి. భీమునిపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ మంత్రి ప్రసంగిస్తూండగా ఒక వృద్ధురాలు లేచి సభా వేదిక వద్ద ఉన్న అవంతి ముందుకు వచ్చారు.
తనకు సంతానం ఉన్నా ఎవరూ చూడడం లేదని, వైసీపీ ప్రభుత్వం వల్లనే తాను ఈ రోజు బతికి ఉన్నాను అంటూ ఆ వృద్ధురాలు జగన్ ఫోటోకు దండం పెట్టేశారు. తనకు పెన్షన్ ప్రభుత్వం ఠంచనుగా ప్రతీ నెలా ఒకటవ తేదీకి ఇస్తోందని, ఉచితంగా వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిందని తాను జగన్నే నమ్ముకుని బతుకుతున్నాను అని వృద్ధురాలు భావోద్వేగంతో అనడంతో అవంతి కూడా చలించిపోయారు.
ఇది కదా ఒక ప్రభుత్వం పనితీరుకు అద్దం పట్టేది అన్న మాట అంతటా వినిపిస్తోంది. ప్రభుత్వం ఏమి చేసింది అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం వారి ఆరోగ్యానికి భద్రత కల్పించడం ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం వంటివి కనుక చూస్తే..వైసీపీ పాలనలో ఏమి మేలు జరిగింది అన్నది స్పష్టంగా అర్ధం అవుతుంది అంటున్నారు. ఈ రోజున ఏపీలో ప్రతీ కుటుంబానికి పెద్దన్నలా జగన్ ఉన్నారని అంటున్నారు.