తెలంగాణ కొత్త ప్రభుత్వం పాలనలో.. వివిధ పత్రాల సరిగమలు పల్లవిస్తున్నాయి. ఈ పత్రాల రూపంలో అధికార విపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడం మాత్రమే లక్ష్యంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్ని శాఖలకు సంబంధించి ఆర్థిక వివరాలు అన్నింటినీ సేకరించి.. రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్ ఇవ్వడానికి అప్పటినుంచి గులాబీ నాయకులు అందరూ నానా పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో భాగంగానే.. స్వేదపత్రం అంటూ ఒక పత్రం విడుదల చేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు.
భారాస తొమ్మిదేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం 11 గంటలకు పీపీటీ ద్వారా ముగిసిపోయిన తమ పాలన గురించి వివరిస్తున్న విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు.
తొమ్మిదిన్నరేల్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి చెబుతామని.. తమ రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించమని ఆయన అంటున్నారు. అందుకే శ్వేతపత్రానికి పోటీగా వారు స్వేదపత్రం తీసుకువస్తున్నారన్నమాట. దీనిలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు, వెల్లడించిన వివరాలకు అన్నీ కౌంటర్లే ఉంటాయని మనం గమనించాలి. అంతకు మించి కొత్తగా ఏం ఉండబోదు!
అయితే దీని తర్వాత కాంగ్రెస్ మళ్లీ రెండు మూడురోజుల్లో మరొక వాదపత్రం తీసుకువస్తుంది. ఇవాళ కేటీఆర్ వెల్లడించబోయే విషయాల్లో అర్ధసత్యాలు ఎన్నో, అసత్యాలు ఎన్నో మళ్లీ కాంగ్రెస్ ప్రకటిస్తుంది. ఈ పరంపరం ఎప్పటికి ముగుస్తుందో మనం వేచిచూడాలి.
కేటీఆర్ కేవలం పీపీటీ ప్రజెంటేషన్ ప్రదర్శించి.. దానిని లైవ్ ఇచ్చి ఊరుకుంటారా? ఆ పీపీటీ ఫైల్ ను కూడా మీడియా మిత్రులకు ఇస్తారా? అనేది గమనించాలి. పీపీటీ ఫైల్ దొరికితే అందులో ప్రతి చిన్న అంశానికి సంబంధించి కూడా.. ప్రభుత్వం కౌంటర్లు తయారుచేసి.. కేటీఆర్ చెప్పేవన్నీ అసత్యాలు లేదా అర్థసత్యాలు అని చాటడానికి ప్రయత్నిస్తుంది.
అయినా ప్రస్తుతానికి ప్రజలు ఏ పార్టీని నమ్ముతున్నారో… ఎవరి మాటలను విశ్వసిస్తున్నారో తేలిపోయింది. ఎవరెన్ని రకాల వాదనలు వినిపించినా, ప్రజల్లోని ఈ అభిప్రాయాలు మారాలంటే ఇంకా కొంత కాలం పడుతుంది.