సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మేధావి, మంచి వక్తగా గుర్తింపు ఉంది. ఆ మేధావితనాన్ని ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తన మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా నిరూపించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఆయనకు రాజకీయాధికారాన్ని చవిచూడాలనే అభిలాష కూడా ఉంది. అందుకోసం అడుగులు వేయడంలో మాత్రం తడబాటు ఉంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేడీ లక్ష్మీనారాయణ సొంతంగా ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించిన వైనం గమనిస్తోంటే.. ఆయనలో చాపల్యం కూడా ఉన్నదని ప్రజలకు అనిపిస్తోంది.
జేడీ లక్ష్మీనారాయణ కు ఎంపీ కావాలనేది కోరిక, సర్వీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా అడుగులు వేయడం ప్రారంభించారు. గత ఎన్నికల సమయంలో రకరణాల సమీకరణాల నేపథ్యంలో ఆయన జనసేన పార్టీకి దగ్గరయ్యారు.
ఎంతో కీలకమైన విశాఖపట్టణం ఎంపీ సీటునుంచి పోటీచేశారు. పవన్ కల్యాణ్ అర్భాటాన్ని గమనించి ఎన్నికల్లో విజయం తథ్యం అని అనుకున్నారేమో తెలియదు గానీ.. గెలుపుపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో అసలు పవన్ కల్యాణ్ స్వయంగా తానే రెండుచోట్లా గెలవలేకపోయిన పరిస్థితుల్లో… విశాఖలో ఆ పార్టీనుంచి జేడీ లక్ష్మీనారాయణకు కూడా పరాభవమే ఎదురైంది.
ఎన్నికలు ముగిసిన వెంటనే.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా బాగుండేది. కానీ.. పార్టీకి రాజీనామా చేసి పవన్ పై విమర్శలు చేశారు. ఆ తర్వాత కాల క్రమంలో తనలోని రాజకీయాసక్తిని మాత్రం నిత్యం బయటపెట్టుకుంటూ.. ఎన్నికల్లో పోటీచేస్తానని సొంత పార్టీ పెడతానని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు.
ఎన్నికల్లో పోటీచేయడం మాత్రం తథ్యం అని ఏ పార్టీ తరఫున అనేది తర్వాత చెబుతానని అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మధ్యలో జగన్ పథకాలను పాలనను మెచ్చుకుంటూ మాట్లాడడం కూడా అప్పట్లో సంచలనం అయింది. మొత్తానికి సుదీర్ఘకాలం ఊగిసలాట తరువాత.. లక్ష్మీనారాయణ ఇప్పుడు “జై భారత్ నేషనల్” అనే పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీ తరఫున ఎన్నికలను ఎదుర్కొంటారట.
ప్రత్యేకహోదా విషయంలో అన్ని పార్టీలు విఫలం అయ్యాయట. అవినీతి గురించి ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారట. అవినీతి లేని వ్యవస్థ కోసం, ప్రత్యేకహోదా కోసం పార్టీ పెట్టినట్టుగా చెబుతున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూస్తుండగా… ఇప్పుడు పార్టీ ప్రారంభించి ఏం సాధించగలరని లక్ష్మీనారాయణ అనుకుంటున్నారో తెలియదు.
సొంతంగా పార్టీ ఉంటే… పొత్తు వంటి ప్రతిపాదనతో తనకోసం ఒక టిక్కెట్ తగ్గించుకోవచ్చుననే ఆశ ఉండి ఉండవచ్చునేమో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.