యువగళం సభలో తామే అధికారంలోకి వచ్చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జబ్బలు చరచడం మీద సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
చంద్రబాబు పనస్ మాటలు చూస్తూంటే కలలు కనడం బాగానే ఉంది అనిపిస్తోందని బొత్స అన్నారు. మీరు హ్యాపీగా కలలు కనండి ప్రొసీడ్ అంటూ సీనియర్ మంత్రి వెటకారం చేశారు. అసలు మీ ఇద్దరూ 2014లో ఎందుకు కలిశారు. 2019లో ఎందుకు విడిపోయారు, మళ్లీ 2024లో ఎందుకు కలుస్తున్నారు అని బొత్స ప్రశ్నించారు.
టీడీపీ జనసేనకు 2014లో పెళ్ళి అయింది. 2019లో విడాకులు వచ్చాయని ఇప్పుడు వాటిని కాదని మళ్లీ పెళ్ళి చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. దొంగల ముఠా మళ్లీ వస్తోంది అని ప్రజలు నమ్మవద్దు అని బొత్స సూచించారు.
చంద్రబాబు హామీల మీద హామీలు ఇస్తున్నారు అసలు ఆయన ఉత్తరాంధ్రాకు ఏమి చేసారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖకు రాజధాని రాకుండా ఎప్పటికపుడు అడ్డంకులు సృష్టిస్తూ తీరని హాని చేస్తున్నారు అని బొత్స మండిపడ్డారు.
చంద్రబాబు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఉత్తరాంధ్రా మీద ఎప్పుడూ శీత కన్ను నిర్లక్ష్యం తప్ప చేసిందేంటి అని నిలదీశారు. తాను తన తరువాత తన కొడుకు అన్నట్లుగా యునగళం సభలో హడావుడి చేశారని బొత్స ఫైర్ అయ్యారు.
అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరికమా అని చంద్రబాబుని ప్రశ్నించారు. లోకేష్ ని హైలెట్ చేయడం కోసమే సభ పెట్టారని అన్నారు. నారా లోకేష్ మాటలకు అర్థాలు ఏమీ ఉండవని ఆయన పిల్లవాడు అని బొత్స కొట్టి పారేశారు. రాజకీయాల్లో రాణించడానికి రెడ్ బుక్ కాదు బ్లూ బుక్ అవసరం అన్నది కూడా లోకేష్ కి తెలియదు అని బొత్స అపహాస్యం చేశారు.
ఊరకే ఉచిత హామీలు అన్నీ గుప్పిస్తున్న చంద్రబాబు తాను ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని బొత్స ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే కుదరదు అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేదని పట్టించుకోలేదని బొత్స అన్నారు. చట్టబద్ధంగా ఎవరైనా ఏమైనా చేయగలరని, దాన్ని ఉల్లఘిస్తే చర్యలు ఉంటాయని కూడా అన్నారు.
చంద్రబాబు పవన్ మళ్లీ కుదుర్చుకున్న పొత్తుల మీద బొత్స వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. బాబు క్రెడిబిలిటీనే వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బాబు పద్నాలుగేళ్ళ పాలనలో ఇచ్చిన మాట ఎపుడూ నిలబెట్టుకోలేదని గుర్తు చేస్తున్నారు.