హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఈ దఫా టికెట్ అనుమానమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గోరంట్ల మాధవ్కు దూకుడు స్వభావమే బలమూ, బలహీనతే, పోలీస్ అధికారిగా ఆయన వ్యవహరించిన తీరు పలు సందర్భాల్లో వివాదాస్పదమైంది. 2019 ఎన్నికలకు ముందు నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేసీకి పోలీస్ సంఘం నాయకుడిగా గోరంట్ల మాధవ్ మీసం తిప్పుతూ సవాల్ విసిరారు. నాలుక కోస్తా అని జేసీని హెచ్చరించి రాజకీయంగా అందరి దృష్టిలో పడ్డారు.
దీనికి తోడు అనంతపురం జిల్లాలో రాజకీయంగా ప్రభావితం చేసే కురుబ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం గోరంట్లకు కలిసొచ్చింది. స్వచ్చంద పదవీ విరమణ చేయడం, అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం, హిందూపురం ఎంపీ టికెట్ దక్కించుకోవడం… అన్నీ చకచకా జరిగిపోయాయి. హిందూపురం ఎంపీగా ఆయన గెలుపొందారు.
ముఖ్యంగా న్యూడ్ కాల్ గోరంట్ల మాధవ్కు వ్యక్తిగతంగా, అంతకు మించి అధికార పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించింది. అయితే గోరంట్ల మాధవ్ పై అధికార పార్టీ చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించిన వారిని దబాయించి సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా వుందనే మాట వినిపిస్తోంది.
దీంతో ఆ జిల్లాలో భారీ ప్రక్షాళన చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్కు టికెట్ అనుమానమే అని అంటున్నారు. టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. మరో నియోజకవర్గానికి మార్చాలనే ఆలోచన కూడా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే గోరంట్ల మాధవ్ గాలిలో ఉన్నట్టే. ఉద్యోగుల పరిభాషలో చెప్పాలంటే గోరంట్ల మాధవ్ను వీఆర్కు పంపడానికి జగన్ సిద్ధమయ్యారు.