వైసీపీలో సీనియర్ మంత్రులు కొందరు ఉన్నారు. వారికి ప్రభుత్వంలో సముచితమైన గౌరవ మర్యాదలే అందుతున్నాయి. ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు 1989 నుంచి శాసన సభకు గెలుస్తూ వస్తున్నారు. ఆయన రాజకీయ జీవితం 1981లోనే ప్రారంభం అయింది. సర్పంచ్ గా రాజకీయ అరంగేట్రం చేసిన ధర్మాన.. కాంగ్రెస్ లో యువజన నేతగా ఎదిగారు. చిన్న వయసులోనే మంత్రి అయ్యారు.
కాంగ్రెస్ లో అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా కీలక శాఖలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆయన వైసీపీలోకి వచ్చారు. 2019లో ఆ పార్టీ తరపున గెలిచి రెండవ దఫా విస్తరణలో మంత్రి అయ్యారు. రెవిన్యూ మంత్రిగా సేవలు అందిస్తున్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం చూసిన ధర్మాన రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన సన్నిహితులతో అంటున్నట్లుగా ప్రచారంలో ఉంది. శ్రీకాకుళం ఎంపీగా ఆయనను పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది.
తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చూసుకోవాలని ఈ సీనియర్ మంత్రికి ఉంది. ఎవరికి టికెట్ వస్తుంది ఏమి జరుగుతుంది అన్నది ఒక ఆసక్తిని కలిగించే అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మాన తన ప్రజా జీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో “40 ఏళ్ల ప్రజాజీవితం” పేరుతో రూపొందించిన పుస్తకం ప్రతిని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అందచేశారు.
తన అనుభవానికి సంబంధించిన పుస్తకం అది. ధర్మాన రాజకీయ పరుగు ఎలా సాగిందో తెలిపే పుస్తకం అది. దీనిని ముఖ్యమంత్రికి అందించిన ధర్మాన తన రాజకీయ పరుగుని ఇక్కడితో ఆపేస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ సీనియర్ మంత్రి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అన్నది వైసీపీ వర్గాలలో ప్రచారంగా ఉంది.
తన అనుభవాలను నెమరువేసుకునే సమయం వచ్చింది అని సీనియర్ మంత్రి భావిస్తే మాత్రం దానికి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ అధిష్టానం గట్టిగా చెబితే ధర్మాన, శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చాస్తారేమో కానీ ఎంపీగా అయితే చేయరు అని అంటున్నారు.